
తాళ్లపాలెం సమీపంలో బల్క్‌డ్రగ్ పార్క్ సమస్యపై జగన్‌మోహన్‌రెడ్డికి వివరిస్తున్న వీసం రామకృష్ణ
నక్కపల్లి: రాజయ్యపేట సమీపంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న బల్క్‌డ్రగ్ పార్క్‌ను వ్యతిరేకిస్తూ మత్స్యకారులు చేస్తున్న ఆందోళనను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ తెలిపారు. పాయకరావుపేట సమన్వయకర్త కంబాల జోగులు, మండల మత్స్యకార నాయకులతో కలిసి గురువారం తాళ్లపాలెం సమీపంలో జగన్‌కు ఈ సమస్య గురించి వివరించినట్టు పేర్కొరు. అత్యంత ప్రమాదకర కాలుష్యాన్ని వెదజల్లే బల్క్‌డ్రగ్ పార్క్ వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ వినతిపత్రం అందజేశామన్నారు. వేట మానుకుని నిరాహార దీక్ష చేస్తున్న తమపై పోలీసులు కేసులు పెట్టి ఆంక్షలు విధిస్తున్నారని, తమకు మద్దతుగా వచ్చే వివిధ పార్టీల నాయకులను, ప్రజాసంఘాలను అడ్డుకుంటున్నారని మత్స్యకార నాయకులు వివరించారని తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన వారిలో మత్స్యకార నాయకులు ఎరిపల్లి నాగేశు, చోడిపల్లి శ్రీను, ఎరిపల్లి ముసలయ్య, అప్పలరాజు, సూరిబాబు, పిక్కి తాతీలు నూకరాజు, గొర్ల బాబూరావు, తళ్ల భార్గవ్, జెడ్పీటీసీ సభ్యురాలు గోసల కాసులమ్మ, పార్టీ మండల అధ్యక్షుడు శీరం నర్సింహమూర్తి, వైస్ ఎంపీపీలు వీసం నానాజీ, వెలగా ఈశ్వరరావు, ఎంపీటీసీలు గంటా తిరుపతిరావు, గొర్ల గోవిందు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు ముఖ్య నాయకులు ఉన్నారు.
గోవాడ సుగర్స్‌ను ఆదుకోవాలని రైతుల అభ్యర్థన
చోడవరం: గోవాడ సుగర్ ఫ్యాక్టరీని, చెరకు రైతులను ఆదుకోవాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీప అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి చోడవరం, మాడుగుల నియోజకవర్గాలకు చెందిన చెరకు రైతులు, స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు కొత్తూరు జంక్షన్ వద్ద వినతిపత్రం ఇచ్చారు. గతేడాదికి సంబంధించిన చెరకు బకాయిలు రైతులకు ఫ్యాక్టరీ ఇంకా చెల్లించలేదని, కార్మికులకు ఆరు నెలలుగా జీతాలు చెల్లించలేదని, ఈ ఏడాది క్రషింగ్ చేస్తారో చేయరో తెలియని అగమ్య పరిస్థితిలో ఫ్యాక్టరీ, రైతులు ఉన్నారని, ప్రభుత్వం తక్షణ సాయంగా రూ.50 కోట్లు ఇచ్చి ఫ్యాక్టరీని ఆదుకునేలా రైతులకు మద్దతు ఇవ్వాలని రైతులంతా జగన్‌మోహన్‌రెడ్డికి విన్నవించుకున్నారు. దీనిపై ఆయన స్పందించి, రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రైతులతోపాటు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావు, సీడీసీ చైర్మన్ సుంకర శ్రీనివాసరావు, ఎంపీపీ గాడి కాసు అప్పారావు, వైస్ ఎంపీపీ శరగడం నాగేశ్వరరావు, ఎంపీటీసీ సూరిశెట్టి నాగదుర్గ గోవింద, పార్టీ నాయకులు, చెరకు రైతులు శరగడం చిమ్మినాయుడు, ఎంపీటీసీలు గూనూరు రాజు, గూనూరు రామకృష్ణ, గాడి అప్పారావు, బూరే మాణిక్యం, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.