
అచ్చెర్ల జంక్షన్‌లో బుచ్చెయ్యపేట జెడ్పీటీసీ సభ్యుడు దొండా రాంబాబును హెచ్చరిస్తున్న అనకాపల్లి డీఎస్పీ శ్రావణి
జగన్‌మోహన్‌రెడ్డిని కలవకుండా అడ్డంకులు
నాతవరం: మాకవరపాలెం మండలంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల సందర్శనకు వస్తున్న మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ శ్రేణులతోపాటు ప్రజా ప్రతినిధులను సైతం పోలీసులు అడ్డుకుని ఓవరాక్షన్ చేశారు. మాజీ ఎమ్మెల్యేలు కంబాల జోగులు, చెంగల వెంకటరావు, రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ, నక్కపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు కాసులమ్మ, ఎస్.రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట మండలాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ముఖ్య నాయకులు మాకవరపాలెం బయలు దేరారు. ఈ క్రమంలో కశింకోట మండలం జి.భీమవరం వద్ద ఎస్పీ తుహిన్ సిన్హా అడ్డుకుని అధిక సంఖ్యలో వెళ్లడానికి అనుమతులు లేవంటూ సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, లేకుంటే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దాంతో వారంతా జి. భీమవరం ఆలయం వద్ద ఉండిపోయారు. అదే సమయంలో మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కాన్వాయ్ రావడంతో తమ సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. కూటమి ప్రభుత్వం పేదలను ఇబ్బంది పెట్టి తమ ప్రాంతంలో ఏర్పాటు చేసే బల్క్ డ్రగ్ పార్కును అడ్డుకోవాలని కోరారు. భారీ వర్షాన్ని ఖాతరు చేయకుండా వారు చెప్పే సమస్యలను సావధానంగా విన్నారు. మీ వెంట నేను ఉన్నానని భరోసా ఇచ్చారు. పోలీసులు సమావేశానికి రాకుండా ఎన్ని ఆటంకాలు సృష్టించిన జగన్‌మోహన్‌రెడ్డిని కలిసినందుకు సంతోషంగా ఉందన్నారు.
పేదలకు ఉచిత వైద్యం అందకుండా కుట్ర..
ప్రతి ఒక్కరికీ విద్య, వైద్యం ఉచితంగా అందించాలనే లక్ష్యంతోనే జగనన్న రాష్ట్రంలో 17 వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పేదలకు ఉచితంగా వైద్యం చేరువ కావాలని ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాలలకు గత ప్రభుత్వంలో శంకుస్థాపనలు చేశారు. ప్రభుత్వం మారితే ప్రైవేటుపరం చేస్తారా? పేదలకు ఉచితంగా వైద్యం కూడా అందించకుండా కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు విరమించుకోవాలనే జగనన్న అడుగులోనే మేము అడుగు వేశాం. ఆయన పోరాటానికి మద్దతుగా నిలబడాలనే వచ్చాను.
–పావని, తుమ్మపాల, అనకాపల్లి మండలం
జనం కోసమే జగన్
నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలం భీమబోయినపాలెం వద్ద నిర్మాణంలో ఉన్న వైద్య కళాశాల పరిశీలనకు వచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అడుగడుగునా పార్టీ శ్రేణులతోపాటు అభిమానులు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మండుటెండలోనూ గంటల కొద్దీ నిరీక్షించి తమ అభిమాన నేతను కలుసుకున్నారు. ఆ సమయంలో జోరున కురిసిన వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆయన వెంట నడిచి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన్ను కలిసి తమ సాధకబాధకాలు చెప్పుకున్న కొంతమంది మనోభావాలు..
జగన్ ఓటమితో అందరూ చాలా బాధపడుతున్నారు
గత ఎన్నికల్లో జగనన్న ఓడిపోవడంతో అందరూ చాలా బాధపడుతున్నారు. ఆయన ప్రభుత్వంలో మాకు ఆర్థికంగా ఎంతో లబ్ధి కలిగింది. ఇప్పుడు కూడా జగనన్నను చూడ్డానికి జనం తండోపతండాలుగా స్వచ్ఛదంగా తరలివస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సింహంలా వచ్చాడు అన్న. వర్షం కూడా లెక్కచేయకుండా జనం కోసం ఆయన పడే తపన చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. ఆయన బాగుంటేనే మహిళలందరికీ మేలు జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో ఆయన గెలుపును ఎవరూ అడ్డుకోలేరు.
– కుప్పిలి మీనా, ఉగ్గినపాలెం, కశింకోట మండలం
జెడ్పీటీసీని అడ్డుకున్న డీఎస్పీ
బుచ్చెయ్యపేట జెడ్పీటీసీ సభ్యుడు దొండా రాంబాబు ఆధ్వర్యంలో చోడవరం నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, రైతులు కశింకోట మండలం అచ్చెర్ల జంక్షన్ వద్ద జగన్‌మోహన్‌రెడ్డిని కలిసేందుకు బయలు దేరారు. మార్గమధ్యంలో బారికేడ్లు అడ్డంగా పెట్టి అనకాపల్లి డీఎస్పీ శ్రావణి అడ్డుకున్నారు. తమ నియోజకవర్గంలో గోవాడ సుగర్ ఫ్యాక్టరీ సమస్యపై జగన్‌మోహన్‌రెడ్డికి వినతి పత్రం ఇవ్వడానికి అనుమతించాలని, ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా నడుచుకుంటామని కోరారు. అయినప్పటికీ చాలాసేపు బారికేడ్లు తీయలేదు. దాంతో ప్రజాప్రతినిధులు, రైతులు ఆగ్రహించారు. తమ నాయకుడిని కలిసేందుకు ఆంక్షలు విధించి అడ్డుకోవడమేమిటని నిలదీశారు. క్రమేపి వివాదం జఠిలం కాకముందే పోలీసులు బారికేడ్లు తొలగించారు.
జగనన్న కోసం ఎక్కడికై నా వస్తాం
జగనన్న కోసం ఎక్కడికై నా రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన్ను చూడటానికి మునగపాక నుంచి వచ్చాను. దారిలో అడుగడుగునా పోలీసులు అడ్డుకున్నారు. అయినా సరే వాళ్లను దాటుకుని పది కిలోమీటర్ల దూరం వచ్చాను. ప్రజల కోసం పోరాటం చేస్తున్న జగనన్నకు ప్రతి ఒక్కరూ తోడుగా నిలుస్తున్నారు. ఈ రోజు కూలీ పని వదులుకుని వచ్చాను. జగనన్నను చూశాను.
–వెలగ రాము, మునగపాక గ్రామం, మండలం
కూటమి హామీలన్నీ మోసమే
గత ఎన్నికల్లో గెలవడానికి కూటమి పెద్దలు ఇచ్చిన హామీలన్నీ ప్రజల్ని మోసగించడానికే. చంద్రబాబుకు వెన్నుపోటు అలవాటే. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరైనా ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయలేదు. కొత్త పింఛన్లు ఎవ్వరికీ మంజూరు చేయలేదు. అంతా పచ్చ మీడియా ప్రచారం తప్పితే కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ప్రయోజనం ఏమీ లేదు. మళ్లీ జగనన్న ప్రభుత్వం వస్తేనే పేదలకు మేలు. గత ఎన్నికల తర్వాత మొదటిసారి జిల్లాకు వస్తున్న జగనన్నను చూడ్డానికి మా ఊరి నుంచి భారీగా ఇక్కడకు తరలివచ్చాం.
– అధికారి వెంకటేశ్వర్రావు, చింతలపాలెం, కశింకోట మండలం
పేదింట్లో వైద్యులు ఉండకూడదా?
పేదవారికి వైద్య విద్యను అందించాలని, పేదింట్లో వైద్యులు ఉండాలని జగనన్న ఆశయం. దాంతోనే ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాల ఉండాలని నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వాటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే పేద విద్యార్థులు ఎప్పటికి వైద్య రంగంలో అడుగుపెట్టలేరు. వైద్యాన్ని పూర్తిగా ప్రైవేటు పరం చేసి పేదవారిని దోచుకోవడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకూ జగన్‌తో పోరాటం చేస్తారు. ఆయన పోరాటానికి మద్దతుగా నిలవడానికే మేమంతా వచ్చాం.
–మచ్చా నరేష్, అరబుపాలెం, మనగపాక మండలం

జి.భీమవరం వద్ద మాజీ ఎమ్మెల్యే కంబాలు జోగులు పార్టీ నేత వీసం రామకృష్ణలకు ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాలు