
ఆర్టీసీ బస్సు డ్రైవర్ తీరుపై మహిళ ఆగ్రహం
వడ్డాది నాలుగు రోడ్ల జంక్షన్‌లో బస్సు ఆపేసి నిరసన
నిలిచిపోయిన ట్రాఫిక్
బుచ్చెయ్యపేట: ఆర్టీసీ బస్సు డ్రైవర్ తీరును నిరసిస్తూ ఓ మహిళ వడ్డాది నాలుగు రోడ్ల జంక్షన్‌లో ఆర్టీసీ బస్సును రోడ్డుపై ఆపేసి ఆందోళనకు దిగింది. మాడుగులకు చెందిన ఓ మహిళ పరవాడలో ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోంది. మాడుగుల నుంచి వడ్డాది వచ్చి, వడ్డాది నుంచి తన కంపెనీ బస్సులో రోజూ విధులకు వెళ్లి వస్తుంటుంది. బుధవారం ఎప్పటిలాగే వడ్డాది రావడానికి మాడుగులలో విశాఖ–మాడుగుల ఆర్టీసీ బస్సు ఎక్కగా డ్రైవర్ ఈ బస్సు వడ్డాది వెళ్లదని చెప్పాడు.
దీంతో ఆ మహిళ బస్సు దిగిపోయింది. డ్యూటీకి వెళ్లడానికి ఆలస్యమవుతోందని వడ్డాదిలో దింపమని తన భర్తను కోరింది. భర్త బైక్‌పై ఆమెను వడ్డాది తీసుకు వచ్చాడు. అప్పటికే మాడుగులలో ఎక్కగా దింపేసిన ఆర్టీసీ బస్సు వడ్డాది జంక్షన్‌లో ఉండడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను అడిగితే వడ్డాది బస్సు వెళ్లదని సమాధానం చెప్పి, ఇప్పుడు వడ్డాది జంక్షన్‌కు బస్సును ఎందుకు తీసికొచ్చారని డ్రైవర్‌ను ప్రశ్నించింది. వడ్డాది నాలుగు రోడ్ల జంక్షన్‌లో ఆర్టీసీ బస్సు ముందు నిలబడి నిరసనకు దిగింది.
ఆమెకు మద్దతుగా ఆమె కుటుంబ సభ్యులు నిలిచారు. దీంతో పాడేరు, చోడవరం, అనకాపల్లి, మాడుగుల వెళ్లే ఆర్టీసీ బస్సులతో పాటు ఇతర వాహనాలు ట్రాఫిక్‌లో నిలిచిపోయాయి. అర గంటకు పైగా వాహనాలు నాలుగు రోడ్ల జంక్షన్‌లో ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. పలువురు అత్యవసరంగా వెళ్లాలని ఆ మహిళలను వేడుకోవడంతో ఆర్టీసీ డ్రైవర్ సారీ చెప్పాలని డిమాండ్ చేసింది. డ్రైవర్ ఎంతకీ సారీ చెప్పకపోవడంతో నిరసన విరమించడానికి అంగీకరించలేదు. స్థానికులు, కుటుంబ సభ్యులు నచ్చజెప్పడంతో ఆ మహిళ ఎట్టకేలకు నిరసన విరమించింది.

ఆర్టీసీ బస్సు డ్రైవర్ తీరుపై మహిళ ఆగ్రహం