
విద్యార్థుల స్థాయికి తగ్గట్లు బోధించాలి
సబ్బవరం: ఉపాధ్యాయులు నిత్య విద్యార్థులుగా ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకుంటూ, విద్యార్థుల స్థాయికి తగ్గట్లు బోధన చేసి, వారిని బాధ్యతాయుత పౌరులుగా తయారు చేసేందుకు కృషి చేయాలని అల్లూరి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ తెలిపారు. సబ్బవరంలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో డీఎస్సీ–2025లో ఎంపికై న ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న ఇండక్షన్ శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. నూతన ఉపాధ్యాయులకు ఏ విధంగా శిక్షణ అందిస్తున్నారో తెలుసుకుని, బోధనలో అవలంభించాల్సిన పద్ధతులను సూచించారు. విద్యార్థుల స్థాయికి తగ్గట్లు బోధన చేయాలన్నారు. శిక్షణ కార్యక్రమంలో ప్రదర్శించిన టీఎల్‌ఎం ప్రాజెక్టులను పరిశీలించారు. ముందుగా వర్సిటీ ఉపకులపతి కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందించి ఆహ్వానించారు. వర్సిటీలో కొత్తగా ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, దామోదరం సంజీవయ్య, మహాత్మా గాంధీ విగ్రహాలను సందర్శించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులను సూచించారు. కార్యక్రమంలో డీఈవో గిడ్డి అప్పారావునాయుడు, ఏపీసీ డాక్టర్ ఎ.అప్పలనాయుడు, అల్లూరి జిల్లా డీఈవో బ్రహ్మాజీ, ఏఎంవో కెజియా, కోర్సు డైరెక్టర్ సింహాచలం, తహసీల్దార్ బి.చిన్నికృష్ణ, ఎంఈవో రవీంద్రబాబు, ట్రైనీలు, డీఆర్పీలు, సీఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.