
వైఎస్ జగన్ పర్యటనను విజయవంతం చేయాలి
మునగపాక: నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలంలోని ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించేందుకు గురువారం వస్తున్న వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం పలకాలని ఆ పార్టీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ పిలుపునిచ్చారు. బుధవారం ప్రసాద్ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ప్రతి పేదవాడు చదువుకునేందుకు వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కళాశాలలను గతంలో వైఎస్ జగన్ సర్కారు మంజూరు చేసిందన్నారు. వాటిలో ఇప్పటికే ఏడు కళాశాలల నిర్మాణం పూర్తయిందని చెప్పారు. మిగతా కళాశాలల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయన్నా రు. మాకవరపాలెం మండలంలో మెడికల్ కళాశాల నిర్మాణంలో ఉందన్నారు. అయితే ఇటీవల స్పీకర్ అయ్యన్నపాత్రుడు అసలు ఇక్కడ మెడికల్ కళాశాల లేదని, జీవో కూడా లేదంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం విచారకరమని చెప్పారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసేందుకు కుట్రలు పన్నుతోందని తెలిపారు. ఇటువంటి చర్యలు సరికాదంటూ ప్రజలకు వివరించడంలో భాగంగా వైఎస్ జగన్ మాకవరపాలెం మండలంలో కళాశాలను సందర్శించేందుకు వస్తున్నారని, ఆయన పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన కళాశాల ప్రాంగణానికి చేరుకుంటారని, పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి, ఘన స్వాగతం పలకాలన్నారు.