
25వ రోజు కొనసాగిన మత్స్యకారుల ఆందోళన
నక్కపల్లి: బల్క్‌డ్రగ్‌పార్క్‌ను వ్యతిరేకిస్తూ రాజయ్యపేట మత్స్యకారులు చేస్తున్న ఆందోళన 25వ రోజు బుధవారం కొనసాగింది. బల్క్ డ్రగ్‌పార్క్‌ను వ్యతిరేకిస్తూ తాము చేపట్టిన ఉద్యమంలో వెనుకడుగు వేసేప్రసక్తి లేదని వారు చెప్పారు. ఇతర జిల్లాల్లో వ్యతిరేకించిన ప్రమాదకర రసాయన పరిశ్రమలను మా ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని చూస్తే సహించేది లేదన్నారు. ప్రాణాలొడ్డయినా సరే అడ్డుకుని తీరుతామన్నారు. తమకు సంఘీభావం తెలిపేందుకు వచ్చే వివిధ రాజకీయ పార్టీ నాయకులను ప్రభుత్వం పోలీసుల సాయంతో అడ్డుకుంటోందని తెలిపారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఓట్లకోసం వచ్చినప్పుడు తమ సత్తా చూపిస్తామన్నారు. టీడీపీని నమ్మి రెండు వేల ఓట్ల మెజార్టీ ఇస్తే తగిన బుద్ధి చెప్పారని మండిపడుతున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడే వరకు నిరాహార దీక్షకొనసాగిస్తామని మత్స్యకారులు తెలిపారు. ఈ దీక్షలో మాజీ ఎంపీటీసీ పిక్కి తాతీలు, మత్స్యకార నాయకులు మైలపల్లి సూరిబాబు, కర్రి చంద్రశేఖర్, సోమేష్, పిక్కిస్వామి, అప్పలరాజు, సూరి, కాశీ, నానాజీ మహేష్ సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.