
మాజీ సీఎం జగన్ పర్యటన విజయవంతానికి పిలుపు
దేవరాపల్లి: మాకవరపాలెం మెడికల్ కాలేజీ సందర్శనకు విచ్చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు బూడి ముత్యాలనాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు తారువలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. అధినేత జగన్‌కు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలి రావాలన్నారు. పేదలకు మెరుగైన వైద్య సేవలతో పాటు పేద విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేయాలనే ఆశయంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. వీటిలో ఏడు కాలేజీలను పూర్తి చేశారన్నారు. నిర్మాణంలో ఉన్న కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటు పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం పూనుకుందని, దీంతో ఈ ప్రాంత పేద విద్యార్థులకు, ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో నూతనంగా మంజూరు చేసిన మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాలనే డిమాండ్‌తో నర్సీపట్నం నియోజకవర్గం, మాకవరపాలెం మండలం భీమబోయినపాలెంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ సందర్శనకు మాజీ సీఎం జగన్ వస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.