
ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛాంధ్ర కల సాకారం
అనకాపల్లి టౌన్: ప్రజల సహకారంతోనే స్వచ్ఛాంధ్ర లక్ష్యం సాకారం అవుతుందని కల్టెర్ విజయ కృష్ణన్ అన్నారు. స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో సోమవారం జిల్లా స్థాయి స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో అహర్నిశలు శ్రమిస్తున్న గ్రీన్ అంబాసిడర్లకు ప్రజలు సహకరించాలని తెలిపారు. గ్రామాలను శుభ్రంగా ఉంచడంలో గ్రామస్తుల భాగస్వామ్యం ముఖ్యమని, చెత్తను రోడ్ల మీద, కాలువలో వేయకుండా పారిశుధ్య సిబ్బందికి తడి చెత్త, పొడి చెత్తగా విడదీసి అందజేసి వారికి సహకరించాలన్నారు. ప్రజలు తమ ఇంటితోపాటు వారు నివసిస్తున్న వీధిని, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. విరివిగా మొక్కలు నాటాలన్నారు. శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ, బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడారు. అనంతరం వివిధ రంగాలు, ప్రభుత్వ శాఖలకు చెందిన 45 మందికి స్వచ్ఛాంధ్ర అవార్డులు, మెమెంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణమూర్తి, రెవెన్యూ డివిజనల్ అధికారి షేక్ ఆయిషా, వివిధ కార్పొరేషన్ల చైర్మన్‌లు పాల్గొన్నారు.
అవార్డుల ప్రదానోత్సవంలో కలెక్టర్ విజయ కృష్ణన్