
బడుగులపై పిడుగుపాటు
జిల్లాలో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతోపాటు పలుచోట్ల పిడుగులు పడ్డాయి. వీటి ధాటికి కె.కోటపాడు మండలంలో రైతు దుర్మరణం చెందగా, నక్కపల్లి మండలంలో రెండు గేదెలు, యలమంచిలి మండలంలో ఒక గేదె మరణించాయి.
కె.కోటపాడు: మండలంలో పొడుగుపాలెం గ్రామానికి చెందిన రైతు లెక్కల జగన్నాథం(52) ఆదివారం సాయంత్రం కురిసిన వర్షంతోపాటు పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. ఈ మృతిపై ఎ.కోడూరు పోలీసులకు మృతుడు భార్య లక్ష్మి సోమవారం ఫిర్యాదు చేసింది. పొలంలో ఉన్న సమయంలో పిడుగు పడడంతో అతడు మృతి చెందినట్లు ఫిర్యాదులో పేర్కొంది. మృతుడికి భార్యతోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కె.కోటపాడు సీహెచ్‌సీలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు మృతదేహానికి అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ డి.లక్ష్మీనారాయణ తెలిపారు.
నక్కపల్లి: మండలంలో రాజయ్యపేటలో ఆదివారం రాత్రి పిడుగు పడి రెండు గేదెలు మరణించాయి. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. ఇదే సమయంలో పిడుగులు పడ్డాయి. పిడుగు పాటుకు రెండు గేదెలు అక్కడికక్కడే మరణించాయని బాధితుడు గ్రామ మత్స్యకారుడు మైలపల్లి బైరాగి వాపోయాడు. రెండు పాడి గేదెలను ఇటీవలే రూ.1.50 లక్షలకు కొనుగోలు చేశానని, అవి మృత్యువాత పడటంతో తీవ్రంగా నష్టపోయానంటూ కన్నీటి పర్యంతమవుతున్నాడు.
యలమంచిలి రూరల్: మున్సిపాలిటీ పరిధి తెరువుపల్లిలో ఆదివారం రాత్రి పిడుగుపాటుకు గేదె మృతి చెందింది. యలమంచిలిలో పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. దాంతో రైతు తుమ్మపాల పైడికొండ తన గేదెను పశువుల పాకలో కట్టి ఉంచాడు. రాత్రి పిడుగు పడడంతో పశువుల పాక కాలిబూడిదైంది. పాకలో గేదె మృతి చెందింది. సోమవారం తెల్లవారుజామున పాక వద్ద గేదె కళేబరాన్ని చూసిన కన్నీటిపర్యంతమయ్యాడు. తనకు జీవనాధారమైన పశువు ప్రకృతి విపత్తుతో కోల్పోయానని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు. తెరువుపల్లి వార్డు కౌన్సిలర్ చిన్న శ్రీను, గ్రామ పెద్దలు రైతును ఓదార్చారు. పశుబీమా పరిహారం మంజూరయ్యేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

బడుగులపై పిడుగుపాటు

బడుగులపై పిడుగుపాటు