
బియ్యం సరఫరాలో కూటమి ప్రభుత్వం విఫలం
నాతవరం: రేషన్ డిపోలకు బియ్యం సరఫరా చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమవుతోంది. దీంతో ఇటు డీలర్లకు, అటు కార్డుదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. నర్సీపట్నం రెవెన్యూ డివిజన్‌లో ఆదివారం నాటికి 200 పైగా రేషన్‌డిపోలకు బియ్యం సరఫరా కాలేదు. నర్సీపట్నం ఎంఎల్‌సీ పాయింట్ పరిధిలో గల నర్సీపట్నం, గొలుగొండ, మాకవరపాలెం, రోలుగుంట, కోటవురట్ల మండలాల్లో గల 125 పైగా డిపోలకు పూర్తిగా(260 టన్నుల) బియ్యం అందలేదు. నాతవరం మండలంలో 42 రేషన్ డిపోలుండగా వీటిలో ఐదు డిపోలకు పూర్తిగా (30 టన్నుల) బియ్యం సరఫరా చేయలేదు.అరకొరగా వచ్చిన బియ్యాన్ని లబ్ధిదారులకు అందజేయడంలో డీలర్లు ఇబ్బందులకు గురవుతున్నారు. బియ్యం అందని రేషన్‌కార్డు దారులు వాగ్వాదాలకు దిగుతున్నారు. రావికమతం మండలానికి 140 టన్నులు, పాయకరావుపేట మండలానికి 200 టన్నులు ఇంకా సరఫరా చేయవలసి ఉంది. ప్రతి నెల 25 తేదీ నుంచే రేషన్ బియ్యాన్ని జిల్లా వ్యాప్తంగా మండలాలకు తరలిస్తుంటారు. మండలాల్లోని గోదాముల నుంచి గ్రామాల్లో రేషన్ దుకాణాలకు నేలాఖరున పంపుతారు. అయితే ఈ సారి బియ్యం సరఫరాలో తీవ్ర జాప్యం జరిగింది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి సకాలంలో బియ్యం సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టాలని కార్డుదారులు కోరుతున్నారు. ఈవిషయంపై జిల్లా పౌరసరఫరాల శాఖ డీఎంను ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించగా స్పందించలేదు.
రేషన్ కార్డుదారులకు పంపిణీలో జాప్యం