
కొత్త బైక్ సరదా తీరకుండానే మృత్యు ఒడికి..
యలమంచిలి రూరల్: దసరా సందర్భంగా ముచ్చటపడి కొనుగోలు చేసిన కొత్త ద్విచక్రవాహనమే ఆ యువకుడి పాలిట మృత్యువు శకటంగా మారింది.కొత్త వాహనానికి పూజ చేసి పక్క గ్రామంలో ఉన్న స్నేహితుడి వద్దకు వెళ్లేందుకు బయలుదేరిన యువకుడు ఊహించని విధంగా ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. రాంబిల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన బత్తిని చంద్రశేఖర్(21) దసరా పండగ సందర్భంగా బైక్‌ను కొనుగోలు చేశాడు.గురువారం సాయంత్రం 4.30 గంటల సమయంలో పక్కనున్న కట్టుపాలెంలో స్నేహితుడి వద్దకు వెళ్లేందుకు బయలుదేరిన చంద్రశేఖర్ కట్టుపాలెం గ్రామం సమీపంలో రోడ్డు పక్కనున్న ఓ చెట్టును ఢీకొన్నాడు.ఈ ప్రమాదంలో యువకుడి తలకు తీవ్ర గాయమైంది. క్షతగాత్రుడిని యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి తరలించిగా ప్రథమ చికిత్స చేసి, పరిస్థితి ప్రమాదకరంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్లారు.అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందినట్టు యలమంచిలి పట్టణ ఎస్‌ఐ కె. సావిత్రి తెలిపారు.మృతుడి పెదనాన్న బత్తిన నాగు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆమె తెలిపారు. పండగవేళ మృతుడి ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి.