
మహాత్మా నిన్ను మరిచారు...
బుచ్చెయ్యపేట: జాతిపిత మహాత్మాగాంధీ జయంతి దగ్గర పడుతోంది. ఐదు రోజుల్లో గాంధీ జయంతి వేడుకలున్నా పలు గ్రామాల్లో మాత్రం గాంధీ విగ్రహాలు శిథిలావస్థలో నే ఉన్నాయి. ఆహింసా మార్గంలో నడిచి బ్రిటిష్ వారిని దేశం నుండి విడిచి వెళ్లేలా చేసి దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన మహాత్ముని విగ్రహాలు విరిగిపోయి దెబ్బతిని ఉండడాన్ని చూసి పలువురి మనస్సులు కలవరపడుతున్నాయి. విద్యార్థులు, నేటి యువత జాతీయ నాయకులను ఆదర్శంగా తీసుకోవాలని, వారి అడుగు జాడల్లో నడుచుకోవాలని గ్రామాల్లో వారి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. జాతీయ నాయకుల విగ్రహాల ఏర్పాటు తరవాత వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవడం లేదు. పొట్టిదొరపాలెంలో ఆర్‌అండ్‌బీ రోడ్డు పక్కన ఆంజనేయస్వామి విగ్రహం ముందు ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం ఎడం చేయి పూర్తిగా విరిగిపోగా కుడి చేతిలో చేతి కర్ర లేదు. మేజర్ పంచాయతీ వడ్డాది కొత్తూరులో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహం కుడి, చేతి కర్ర దెబ్బతిన్నాయి. అలాగే పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాలకు రంగులు పోయి రూపు రేఖలు దెబ్బతిని ఉన్నాయి. స్థానికులు రానున్న గాంధీ జయంతి వేడుకలకు ముందే దెబ్బతిన్న విగ్రహాలను బాగు చేసి రంగులు వేసి అందంగా ముస్తాబు చేస్తారని పలువురు కోరుతున్నారు.
వడ్డాది కొత్తూరులో కుడిచేయి దెబ్బతిన్న గాంధీ విగ్రహం
పొట్టిదొరపాలెంలో చేయి విరిగిన గాంధీ విగ్రహం

మహాత్మా నిన్ను మరిచారు...