
తాచేరు డైవర్షన్ రోడ్డు పనులు ప్రారంభం
బుచ్చెయ్యపేట: భీమునిపట్నం, నర్సీపట్నం(బీఎన్) రోడ్డులో విజయరామరాజుపేట తాచేరు నదిపై కోతకు గురైన డైవర్షన్ రోడ్డు పనులను అధికారులు చేపట్టారు. రెండు రోజుల వ్యవధిలో తాచేరులో మునిగి ఇద్దరు మృతి చెందారు. దీనిపై పత్రికల్లో వచ్చిన కథనాలకు అధికారులు స్పందించారు. కోతకు గురైన తాచేరు డైవర్షన్ రోడ్డు వద్ద శనివారం మధ్యాహ్నం నుంచి పొక్లెయిన్‌తో పనులు ప్రారంభించారు. తాచేరు నదిలో వరదకు కొట్టుకు వచ్చిన చెట్లు, తుప్పలు,డొంకలను తొలగించారు. దెబ్బతిన్న సిమెంట్ గొట్టాలను తొలగించి, వాటిలో స్థానంలో కొత్త పైపులను వేసి,వాటిపై గ్రావెల్ వేసి రోలింగ్ చేసి తాత్కాలికంగా వాహనాల రాకపోకలు సాగేలా చర్యలు చేపట్టారు. తాచేరు డైవర్షన్ రోడ్డు కోతకు గురవడంతో విశాఖపట్నం, పాడేరు, నర్సీప ట్నం, అనకాపల్లి తదితర ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులతో పాటు ఇతర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రెండు నెలలుగా బీఎన్ రోడ్డులో రాకపోకలు నిలిచిపోవడంతో మూడు జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇరుకు రోడ్డులో రాకపోకలు సాగిస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. తాచేరు నది సమీపంలో దెబ్బతిన్న డైవర్షన్ రోడ్డు వద్ద నీటిలో పడి విజయరామరాజుపేటకు చెందిన 8వ తరగతి విద్యార్థి,వడ్డాదికి చెందిన రైతు రెండు రోజుల వ్యవధిలో మృతి చెందారు. పలువురు ప్రాణాలకు తెగించి తాడు సాయంతో తాచేరు నదిలో రాకపోకలు సాగిస్తున్నారు. పత్రికల్లో వచ్చిన కథనాలకు ఇప్పటికే అధికారులు స్పందించారు. తాచేరు నదిపై డైవర్షన్ రోడ్డు పనులు పూర్తి చేసి వాహనాల రాకపోకలు సాగేలా చూస్తామని చోడవరం ఆర్‌అండ్‌బీ జేఈ సత్య ప్రకాష్ తెలిపారు.విజయరామరాజుపేట తాచేరు వంతెనపై వరదలకు దెబ్బతిన్న డైవర్షన్ రోడ్డును రెండు నెలలైనా బాగు చేయకపోవడం సిగ్గుచేటని చోడవరం నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి పి.వి.ఎస్.ఎన్. రాజు అన్నారు. కోతకు గురైన తాచేరు డైవర్షన్ రోడ్డును శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుమారు 20 మీటర్లు దెబ్బతిన్న తాచేరు డైవర్షన్ రోడ్డుకు మరమ్మతులు చేయడంలో అధికారులు విఫలం చెందారని చెప్పారు.