
క్వారీ బాధితుల దీక్ష భగ్నం
నర్సీపట్నం: మాకవరపాలెం మండలం, జి.కోడూరు క్వారీ బాధితులు రెండు నెలలుగా ఆర్డీవో కార్యాలయం వద్ద చేస్తున్న రిలే నిరాహారదీక్షను మంగళవారం పోలీసులు భగ్నం చేశారు. మూడు రోజుల క్రితం బాధితుల దీక్షా శిబిరం టెంట్‌ను అధికారులు తొలగించారు. దీంతో ఆందోళనకారులు రెండు రోజులుగా గొడుగులు వేసుకుని దీక్ష కొనసాగిస్తున్నారు. టౌన్ సీఐ గోవిందరావు, ఎస్సైలు రమేష్, ఉమామహేశ్వరరావు, సిబ్బంది మంగళవారం దీక్ష వద్దకు చేరుకున్నారు. అనుమతి లేకుండా దీక్ష చేయటం సరికాదని, విరమించాలని సూచించారు. స్పష్టమైన హామీ ఇస్తేనే కానీ విరమించమని బాధితులు పేర్కొన్నారు. ఈ సమయంలో బాధితులకు మద్దతుగా నిలిచిన బీఎస్పీ నాయకులు బొట్టా నాగరాజు, కె.వి.పి.ఎస్.చిరంజీవిలకు.. పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు దీక్షలో ఉన్న వారిని బలవంతంగా లేవదీసి వ్యాన్‌లో ఎక్కించి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం విడిచిపెట్టారు.