
తిమిరాం వారపు సంతకు దసరా శోభ
దేవరాపల్లి: మండలంలోని తిమిరాంలో శుక్రవారం జరిగిన వారపు సంత దసరా శోభను సంతరించుకుంది. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని పొట్టేళ్లు, మేకపోతులు, నాటుకోళ్లకు యమ గిరాకీ ఏర్పడింది. దసరాకు ముందు వచ్చే సంత కావడంతో జిల్లా నలుమూలల నుంచి గొర్రెపోతులు, మేక పోతులతో పాటు నాటు కోళ్లును విక్రయించేందుకు రైతులు అధిక సంఖ్యలో తీసుకువచ్చారు. వీటిని కొనుగోలు చేసేందుకు విశాఖపట్నం, విజయనగరం, పాడేరు తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు, ప్రజలు తరలివచ్చారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని మోటార్లు, మోటారు వాహనాలకు, యంత్ర పరికరాలకు పొట్టేళ్లు, నాటు కోళ్లను మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ.. ఈ నేపథ్యంలోనే ఇక్కడి వారపు సంతకు జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో కొనుగోలుదారులు రావండతో వీటి ధరలు అమాంతం పెరిగాయి. ఇక్కడి వారపు సంతలో తక్కువ ధరకు ఆరోగ్యకరమైన పొట్టేళ్లు, మేక పోతులు, నాటుకోళ్లు లభిస్తాయన్న అభిప్రాయంతో సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడకు వస్తారు. 10 కిలోల బరువు గల పొట్టేళ్లు రూ. 25 వేలు నుంచి రూ. 35 వేల వరకు ధర పలికాయి. సాధారణ రోజుల్లో రూ. 1500 నుంచి రూ. 2000 ధర పలికే కోళ్లకు రూ. 3000 నుంచి రూ. 5 వేలు వరకు ధరలు పెరగాయి.
వారపు సంతకు భారీగా
వచ్చిన పొట్టేళ్లు, మేకపోతులు
అమాంతంగా పెరిగిన ధరలు
నాటు కోళ్ల ధరలకు రెక్కలు
కొనుగోలుదారులతో కిటకిటలాడిన వారపు సంత ప్రాంగణం

తిమిరాం వారపు సంతకు దసరా శోభ

తిమిరాం వారపు సంతకు దసరా శోభ