
అధ్యయన యాత్రలో అడ్డగోలుతనం
డాబాగార్డెన్స్(విశాఖ): జీవీఎంసీ అధ్యయన యాత్రలు విహార యాత్రలుగా మారాయనే ఆరోపణలు సర్వసాధారణం. అందుకే వామపక్ష కార్పొరేటర్లు వీటిని చాలా వరకు వ్యతిరేకిస్తున్నారు. అయితే అడ్డగోలుగా జీవీఎంసీ మేయర్ పీఠాన్ని దక్కించుకున్న కూటమి ప్రభుత్వం ఈ అధ్యయన యాత్రలను మరింతగా దిగజార్చాయన్న ఆరోపణలు మూటుగట్టుకుంటోంది. కార్పొరేటర్లు, అధికారుల కుటుంబ సభ్యులు ఇన్నాళ్లూ షికార్ల వరకే పరిమితమయ్యేవారు. ఈసారి ఓ అడుగు ముందుకేసి అక్కడి అధికారిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం గమనార్హం. దీన్ని నియంత్రించాల్సిన మేయర్, జీవీఎంసీ అధికారులు ఇందుకు వత్తాసుగా నిలవడమే విశేషం..!
అధ్యయనం పేరిట విహారం : అధ్యయన యాత్రం కోసం మేయర్ పీలా శ్రీనివాసరావుతో పా టు కార్పొరేటర్ల బృందం, వారి కుటుంబ సభ్యులు, జీవీఎంసీ అధికారులు మంగళవారం బయలుదేరిన విషయం తెలిసిందే. వీరంతా షెడ్యూల్ మేరకు బుధవారం జైపూర్ కార్పొరేషన్‌ను సందర్శించారు. వాస్తవానికి అధ్యయన యాత్ర మేయర్, కార్పొరేటర్లు, అధికారులకు మాత్రమే. వారి కుటుంబ సభ్యుల షికారుకు, వారు తీసుకున్న రూమ్ చార్జీల భారమూ జీవీఎంసీయే భరించడం రివాజుగా మారింది. ఈసారి మేయర్, కార్పొరేటర్ల బృందంతో వారి కుటుంబ సభ్యులు కూడా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం వివాదాస్పదంగా మారింది.
వీరి అవసరమేంటో..? : భీమిలి నియోజకవర్గానికి చెందిన ఓ కార్పొరేటర్ భర్త, ఉత్తర నియోజకవర్గానికి చెందిన మరో కార్పొరేటర్ సోదరుడు, దక్షిణ నియోజకవర్గానికి చెందిన ఇంకో కార్పొరేటర్ దగ్గరి బంధువు.. ఇలా చాలా మంది నేరుగా జైపూర్ కార్పొరేషన్‌ను సందర్శించి, జైపూర్ నగర్ నిగమ్ మేయర్ సోనమ్ గుర్జార్‌ను కలుసుకున్నారు. అక్కడి కార్పొరేషన్‌లో నిర్వహించిన సమావేశంలో కూడా వీరంతా పాల్గొనడం గమనార్హం. అసలు ప్రభుత్వ కార్యక్రమాల్లో కార్పొరేటర్ల కుటుంబ సభ్యులు పాల్గొనవచ్చా? నేరుగా అక్కడి కార్పొరేషన్లోనే కార్పొరేటర్లతో కూర్చుంటే మేయర్ పీలా శ్రీనివాసరావు, అధికారులు ఏం చేస్తున్నట్టో..! అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జీవీఎంసీ సొమ్ముతో షికార్లు చేయడమే కాకుండా.. ఇలా జీవీఎంసీ పరువు తీసేలా వ్యవహరించడం సరికాదని నగరవాసులు ఆక్షేపిస్తున్నారు.
జైపూర్ కార్పొరేషన్‌లో జీవీఎంసీ బృందం
జీవీఎంసీ కార్పొరేటర్ల బృందం అధ్యయన యాత్రలో భాగంగా బుధవారం జైపూర్ కార్పొరేషన్‌ను సందర్శించినట్లు జీవీఎంసీ కార్యదర్శి బీవీ రమణ తెలిపారు. మేయర్ పీలా శ్రీనివాసరావు, కార్పొరేటర్ల బృందం జైపూర్(రెడ్ సిటీని) సందర్శించి జైపూర్ అభివృద్ధి కార్యక్రమాలు, వారసత్వ సంరక్షణ, ఘన–ద్రవ వ్యర్థాల నిర్వహణ, ప్రజాహిత పాలన వంటి అంశాలపై అధ్యయనం చేశారని, అలాగే స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ప్రణాళికలు, పురాతన వారసత్వ భవనాల సంరక్షణ, సుస్థిర పట్టణాభివృద్ధి వంటివి అమలవుతున్న నూతన పద్ధతులను మేయర్, కార్పొరేటర్ల బృందం పరిశీలించారని జీవీఎంసీ కార్యదర్శి తెలిపారు. ఈ సందర్భంగా జైపూర్ నగర నిగమ్ మేయర్ సోనమ్ గుర్జార్, ఇంజినీర్ ఓమన్ కార్గ్ జీవీఎంసీ మేయర్, కార్పొరేటర్ల బృందానికి స్వాగతం పలికి, జైపూర్ నగరాభివృద్ధితో పాటు సాధించిన ప్రగతి వివరించినట్లు చెప్పారు. జీవీఎంసీ సాధిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ర్యాంకులు అన్ని నగరాలకు ఆదర్శంగా ఉంటున్నాయని, విశాఖ నగరం సుందరీకరణతో అందర్నీ ఆకర్షిస్తోందని కొనియాడుతూ జ్ఞాపికను జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావుకు జైపూర్ నగర్ నిగమ్ మేయర్ అందించారు. అనంతరం నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, జీవీఎంసీ అధికారులు జైపూర్ మేయర్, అక్కడి అధికారులకు విశాఖ నగరాభివృద్ధికి చేపడుతున్న ప్రాజెక్టులు, పారిశుధ్య నిర్వహణ, రెవెన్యూ, ప్రజాపాలన తదితర అంశాలను వివరించి జీవీఎంసీ తరఫున జ్ఞాపిక అందించినట్లు సెక్రటరీ తెలిపారు.

అధ్యయన యాత్రలో అడ్డగోలుతనం