
సాగుకు, వైద్యానికి కూటమి దెబ్బ
నాతవరం: స్పీకరు అయ్యన్నపాత్రుడు ఇలాకాలో నాడు సాగురైతులకు, నేడు విద్య వైద్య రంగానికి జీర్ణించుకోలేని నష్టం కూటమి ప్రభుత్వం చేస్తోంది. నియోజకవర్గంలో ఏలేరు తాండవ అనుసంధానానికి మెడికల్ కాలేజీకి వై.ఎస్.జగన్‌మోహర్‌రెడ్డి సుమారుగా రూ.1000 కోట్లు మంజూరు చేశారు. ఈరెండింటికీ తాలుకా పనులు వివిధ దశలో జరుగుతున్న నేపధ్యంలో వాటిని పూర్తి చేయకుండా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు మాదిరిగా వ్యవహరించింది. రైతుల శ్రేయస్సు పక్కన పెట్టి ఏలేరు కాలువ నీటిని పైపులైను ద్వారా ప్రైవేటు కంపెనీలకు తరలించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. నాడు ఏలేరు నీటిని రైతులు సాగు కోసం తాండవ ప్రాజెక్టులోకి తరలించేందుకు సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రూ 470.05 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించారు. ఏలేరు తాండవ ప్రాజెక్టు అనుసంధానం పనులు కూటమి ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అదే ఏలేరు కాలువలో నీటిని నాతవరం మండలం ఎంబీపట్నం పంచాయతీ శివారు ఎ.శరభవరం వద్ద ఏలేరు నుంచి పైపులైను ద్వారా నక్కపల్లి మండలానికి తరలించేందుకు పనులు చేస్తున్నారు. నక్కపల్లి మండలంలో నిర్మించనున్న ప్రైవేటు కంపెనీలైన స్టీల్‌ప్లాంటు, బల్క్‌డ్రగ్ పార్కుకు అవసరమైన నీటిని ఇక్కడ్నుంచి తరలించనున్నారు. నీటిని తరలించేందుకు ఎ,శరభవరం వద్ద పంప్‌హౌస్ నిర్మాణానికి భూమిని సేకరించే పనిలో రెవెన్యూ అధికారులు ఉన్నారు. మిట్టల్ కంపెనీ పేరిట రెండు ఎకరాలకుపైగా జిరాయితీ భూమి బలవంతంగా రైతుల నుంచి రెవెన్యూ అధికారులు సేకరిస్తున్నారు. ఏలేరు రిజర్వాయరు తాండవ ప్రాజెక్టు అనుసంధానం పనులు పూర్తి అయితే రెండు జిల్లాల పరిధిలో వేలాది ఎకరాల భూములు సస్యశ్యామలం అవుతుందని రైతులు ఆశించారు. వారి ఆశలను కూటమి ప్రభుత్వం తుంగలోకి తొక్కింది. అనుసంధానం పనులకు నిధులు మంజూరు చేసినప్పుడు 2022లో నర్సీపట్నం, పాయకరావుపేట, ప్రత్తిపాడు ఎమ్మెల్యేలు పెట్ల ఉమా శంకర్ గణేష్, గొల్ల బాబురావు, పర్వతనేని పూర్ణచంద్రప్రసాద్ తాండవ ప్రాజెక్టుపై రైతులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో ఏలేరు తాండవ అనుసంధానం పనులు గత ఏడాది రద్దు చేశారు. ఈఏడాది మాకవరపాలెం మండలంలో మెడికల్ కాలేజీ రూ 500 కోట్లతో పనులు జరుగుతుండగా ప్రభుత్వం ప్రైవేటు పరం చేసేందుకు చూస్తోంది. కళ్ల ముందే అన్యాయం జరుగుతుందని తెలిసి కూడా కూటమి నేతలు నిస్సిగ్గుగా వెనకేసుకు వస్తున్నారు. రైతులకు విద్యార్ధులకు శాశ్వతంగా ఉపయోగ పడే కార్యక్రమాలు వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రారంభిస్తే నేడు ప్రభుత్వం స్వలాభం కోసం ప్రైవేటు పరం చేయాలని చూడడాన్ని ఈ ప్రాంతీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వ ధోరణికి నిరసనగా ఈనెల 18వ తేదీన నర్సీపట్నంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో అందోళన కార్యక్రమం తలపెట్టారు.
ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాం..
జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నియోజకవర్గంలో తలపెట్టిన శాశ్వత పనులను కూటమి ప్రభుత్వం రద్దు చేయడాన్ని ప్రజలు దృష్టికి తీసుకెళ్తాం. వైజాగ్‌లో ఉన్న కింగ్‌జార్జి ఆసుపత్రిని తలపించేలా మాకవరపాలెంలో మెడికల్ కాలేజీ ఆసుపత్రిని నిర్మించాలని నిర్ణయించాం. సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడి అనకాపల్లిలో ఏర్పాటు చేసే కాలేజీని నర్సీపట్నం నియోజకవర్గానికి తీసుకు రావడానికి ఎంతో కృషి చేశారు. దీనిని పూర్తి చేయాల్సిన కూటమి పెద్దలు ప్రైవేటుపరం చేయాలని చూడడం బాధాకరం. కూటమి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజలకు క్షేత్రస్ధాయి లో తెలియజేస్తాం. నేడు నర్సీపట్నంలో గాంధీ విగ్ర హం ఎదుట శాంతియుతంగా నిరసన తెలుపుతాం.
గత ప్రభుత్వంలో నియోజకవర్గంలో
రెండు ప్రాజెక్టులకు రూ. 1000 కోట్లు
కూటమి ప్రభుత్వం రాకతో ఒకటి రద్దు రెండోది ప్రైవేటు పరం
నర్సీపట్నంలో వైఎస్సార్‌సీపీ
అధ్వర్యంలో నిరసన

సాగుకు, వైద్యానికి కూటమి దెబ్బ