
జిల్లాలో 332 మలేరియా, 99 డెంగ్యూ కేసులు నమోదు
జిల్లా మలేరియా అధికారి
కె.వరహాల దొర
దేవరాపల్లి: జిల్లాలో ఈ ఏడాది 332 మలేరియా, 99 డెంగ్యూ కేసులు నమోదైనట్టు జిల్లా మలేరియా అధికారి కె.వరహాల దొర తెలిపారు. స్థానిక పీహెచ్‌సీ ఆవరణలో బుధవారం జరిగిన స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వైద్య శిబిరాన్ని పర్యవేక్షించిన ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. జిల్లాకు చెందిన పలు గ్రామాలు అల్లూరి సీతారామరాజు జిల్లాకు ఆనుకుని ఉండడంతో మలేరియా కేసులు పెరిగాయన్నారు. మలేరియా కేసులు నమోదైన 108 గ్రామాల్లో, 135 హాస్టళ్లలో దోమల నివారణ మందును పిచికారీ చేయించినట్టు చెప్పారు. ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా, లార్వా వృద్ధి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. దోమ కాటుకు గురికాకుండా ప్రతి ఒక్కరూ దోమ తెరలు విధిగా వినియోగించాలన్నారు.