
ఘాటి.. మన్యం అందాలు మీటి
ముంచంగిపుట్టు: ఇటీవల విడుదలైన ‘ఘాటి’ సినిమా కేవలం ఒక థ్రిల్లర్ మాత్రమే కాదు, ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లోని అద్భుతమైన పర్యాటక ప్రాంతాలకు ఒక దృశ్య వేదికగా మారింది. ఈ నెల 5న విడుదలైన ఘాటి చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా.. అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించింది. విక్రమ్ ప్రభు, జగపతి బాబు, చైతన్య రావు, జిషు సేన్ గుప్త వంటి ప్రముఖ నటులు ముఖ్య పాత్రలు పోషించారు.
ప్రత్యేక ఆకర్షణగా సహజసిద్ధ అందాలు
సినిమా షూటింగ్‌లో ఎక్కువ భాగం ఏవోబీ సరిహద్దు ప్రాంతాలైన డుడుమ జలాశయం, డుడుమ జలపాతం, మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రం, వించ్ హౌస్, వ్యూపాయింట్, బలడ కేవ్స్ వంటి ప్రదేశాల్లో చిత్రీకరించారు. సినిమా చూస్తున్నంత సేపు వెండితెరపై ఈ ప్రాంత సహజసిద్ధ అందాలు కనిపిస్తూనే ఉంటాయి.
డ్రోన్ విజివల్స్ హైలైట్
పోలీసు అధికారుల పాత్రలో నటించిన జగపతిబాబు, జాన్ విజయ్ డుడుమ జలాశయం డ్యామ్‌పై వాహనాలను తనిఖీ చేసి, లిక్విడ్ గంజాయిని పట్టుకున్న సన్నివేశం చాలా ఆసక్తికరంగా చిత్రీకరించారు. డుడుమ జలపాతం , మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రాన్ని డ్రోన్‌తో చిత్రీకరించిన అద్భుతమైన దృశ్యాలు ఆకట్టుకున్నా యి. సినిమా కెమెరామెన్ మనోజ్ సరిహ ద్దు ప్రాంతాల అందాలను చాలా చక్కగా ఒడిసిపట్టి తెరపై చూపించగలిగారు.