
విశాఖలోనే ఈఎస్‌ఐ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలి
డాబాగార్డెన్స్: కేంద్ర ప్రభుత్వం ఈఎస్‌ఐ మెడికల్ కాలేజీని అమరావతిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించడంపై సీపీఎం, సీఐటీయూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒత్తిడి కారణంగానే ఈ నిర్ణయం జరిగిందని సీపీఎం నాయకుడు, సిటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింగరావు ఆరోపించారు. సీపీఎం కార్యాలయంలో గురువారం సిటు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కేఎస్‌వీ కుమార్, కోశాధికారి ఎస్.జ్యోతీశ్వరరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. అత్యధికంగా ఈఎస్‌ఐ సభ్యులు 14 లక్షల మంది ఉన్న ఉత్తరాంధ్రలో కాకుండా అమరావతిలో మెడికల్ కాలేజీ పెట్టడం సరికాదన్నారు. షీలానగర్‌లో ఈఎస్‌ఐ హాస్పిటల్ నిర్మాణం తుది దశలో ఉందని, దానికి అనుబంధంగా మెడికల్ కాలేజీని కూడా ఇక్కడే ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి మాత్రమే కాదని, వెనుకబడిన ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేస్తే ఆందోళనలు చేస్తామని నరసింగరావు హెచ్చరించారు. ఈఎస్‌ఐ బోర్డుపై ఒత్తిడి తెచ్చిన కారణంగానే 2022 నుంచి షీలానగర్‌లో ఆస్పత్రి నిర్మాణం వేగవంతమైందని ఆయన గుర్తు చేశారు.