
కూలి పనికి వెళ్లి మృత్యువాత
కోటవురట్ల: అనుకోని ఉపద్రవం విద్యుత్ రూపంలో ఓ వ్యక్తి ఉసురు తీసింది. మండలంలోని చౌడువాడ గ్రామంలో గురువారం వెదురు కర్రలు నరుకుతుండగా ప్రమాదవశాత్తు హై వోల్టేజ్ విద్యుత్ తీగలకు కర్ర చిక్కుకుని రాయి నాగేశ్వరరావు(55) అనే కూలీ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరొక కూలీ గరగా నాగేశ్వరరావు గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మాకవరపాలెం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో చౌడువాడ లైన్‌లో గురువారం జంగిల్ క్లియరెన్సు నిర్వహించారు. ఈ పనిలో భాగంగా చౌడువాడ గ్రామానికి చెందిన వీరిద్దరూ నిచ్చెన కోసం వెదురు కర్రలు నరికేందుకు సిద్ధమయ్యారు. రాయి నాగేశ్వరరావు వెదురు కర్రను పట్టుకోగా, గరగా నాగేశ్వరరావు కత్తితో నరుకుతున్నాడు. ఈ క్రమంలో వెదురు కర్ర ఆన్‌రాక్‌కు వెళుతున్న హై వోల్టేజ్ విద్యుత్ లైన్‌లో చిక్కుకుంది. దానిని పట్టుకున్న రాయి నాగేశ్వరరావుకు షాక్ తగలడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. పక్కనే ఉన్న గరగా నాగేశ్వరరావుకు కొద్దిపాటి షాక్ తగలడంతో ఎగిరి పడి గాయపడ్డాడు. వెంటనే అతడిని కోటవురట్ల సీహెచ్‌సీకి తరలించి చికిత్స అందించారు. మృతుడు రాయి నాగేశ్వరరావుకు భార్య చిట్టిలక్ష్మి, ఒక కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కూలి పనికి వెళ్లి మృత్యువాత