
విశ్వకర్మ సేవలు ఆదర్శనీయం
తుమ్మపాల: విరాట్ విశ్వకర్మ వెనుకబడిన తరగతుల సంక్షేమానికి చేసిన సేవలు ఆదర్శనీయమని జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం విరాట్ విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి జేసీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సృష్టికి ముందే విరాట్ విశ్వకర్మ జన్మించారని, సమాజానికి అవసరమైన వివిధ వృత్తులను ఆయన స్పష్టించారన్నారు. ప్రధానంగా కమ్మరి, వడ్ల, స్వర్ణకార, శిల్ప, కంచరి తదితర వృత్తులను సృష్టించి సమాజానికి అవసరమైన వస్తువులను తయారు చేసుకునేలా ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ప్రపంచపు తొలి వాస్తుశిల్పిగా, సృష్టికర్తగా పేరుగాంచిన విశ్వకర్మను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో వై.సత్యనారాయణ రావు, బీసీ సంక్షేమ శాఖ అధికారి కె.శ్రీదేవి, ఏపీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ సభ్యులు పాల్గొన్నారు.
అనకాపల్లి: స్థానిక ఎస్పీ కార్యాలయంలో విశ్వకర్మ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ చిత్రపటానికి స్పెషల్ బ్రాంచ్ సీఐ బాల సూర్యారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వకర్మకు విశిష్టస్థానం ఉందన్నారు. ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు ఈకార్యక్రమం నిర్వహించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ డి.వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

విశ్వకర్మ సేవలు ఆదర్శనీయం