
మహిళల ఆరోగ్య పరిరక్షణకు స్వస్త్ నారీ సశక్త్ పరివార్
స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ వాల్‌పోస్టర్ ఆవిష్కరిస్తున్న జేసి జాహ్నవి
తుమ్మపాల: మహిళల ఆరోగ్య పరిరక్షణకు స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన సమావేశంలో కార్యక్రమం వాల్‌పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 17 నుంచి జిల్లాలో 46 కేంద్రాల్లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని, అక్టోబరు 2 వరకు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తారని చెప్పారు. మహిళలకు వివిధ రకాల స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించి, అవసరమైన వారికి తగిన వైద్య సేవలను అందించాలని వైద్యఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ ఎం.హైమావతి, జిల్లా ఇమ్యునైజేషను అధికారి డాక్టర్ చంద్రశేఖర్ దేవ్, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ కె. వీరజ్యోతి పాల్గొన్నారు.