
వెలుగు వీవోఏల సమస్యల పరిష్కారానికి ధర్నా
అనకాపల్లి: సార్వత్రిక ఎన్నికల సమయంలో వీవోఏ మూడేళ్ల కాలపరిమితి సర్క్యులర్ రద్దు హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 15 మాసాలవుతున్నా దాన్ని రద్దు చేయకుండా తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని వెలుగు వీవోఏల సంఘం(సిటు) రాష్ట్ర అధ్యక్షురాలు సీహెచ్ రూపాదేవి, సిటు జిల్లా అధ్యక్షుడు వీవీ శ్రీనివాసరావులు మండిపడ్డారు. స్థానిక సిటు కార్యాలయం నుంచి డీఆర్‌డీఏ కార్యాలయం వరకూ వీవోఏల సమస్యల పరిష్కారం కోరుతూ మంగళవారం ధర్నా నిర్వహించారు. అనంతరం డీఆర్‌డీఏ పీడీ శచీదేవికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీవోఏలకు ఉరితాడుగా ఉన్న మూడేళ్ల కాల పరిమితి సర్క్యులర్ రద్దు, ఉద్యోగ భద్రత, పెండింగ్ జీతాల చెల్లింపు తక్షణమే చేయాలనానరు. వీవోఏలకు సంబంధం లేని చాలా పనులు చేయిస్తున్నారని, లబ్ధిదారులతో గేదెల కొనుగోలు, యూరియా సర్వే, వృద్ధుల పెన్షన్ విధులను కూడా అప్పగించడం ఆక్షేపణీయమన్నారు. మూడు నెలలుగా జీతాలు ఇవ్వని ప్రభుత్వం, పనుల్ని మాత్రం క్రమం తప్పకుండా చేయించుకుంటోందని ధ్వజమెత్తారు. ఆందోళనలో సిటు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శంకరరావు, ఉపాధ్యక్షుడు గంటా శ్రీరామ్, వీవోఏల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.వెంకటలక్ష్మి, కోశాధికారి సీహెచ్‌ఎల్‌ఎన్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.