
క్షేత్ర స్థాయి పర్యటనతోనేఅర్జీల పరిష్కారం
అధికారులకు జేసీ జాహ్నవి ఆదేశం ● కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌కు 313 అర్జీలు
తుమ్మపాల: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)లో వచ్చిన అర్జీలపై క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో ఆమెతో పాటు డీఆర్వో వై.సత్యనారాయణరావు, పీజీఆర్‌ఎస్ ప్రత్యేక ఉప కలెక్టర్ ఎస్.సుబ్బలక్ష్మి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించకుండా తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. అప్పుడే అర్జీలు రీఓపెన్ కాకుండా నివారించవచ్చన్నారు. మొత్తం 313 అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అర్జీలు పెట్టినా తల్లికి వందనంపై స్పష్టత లేదు
తన భార్య మృతి చెందడంతో తల్లికి వందనం పథకం నిలిపివేశారని, తండ్రిగా తన బ్యాంక్ ఖాతాను జోడించి పథకం వర్తింపజేయాలని కోరుతూ మూడు సార్లు అర్జీలు అందజేసినా ఎటువంటి ప్రయోజనం లేదని పాయకరావుపేట మండలం మంగవరం గ్రామానికి చెందిన పి.వెంకటేశ్వరరావు పీపీఆర్‌ఎస్‌లో మళ్లీ అర్జీ అందజేశారు. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఒక్కరికి కూడా పథకం మంజూరు చేయలేదన్నారు. సచివాలయ సిబ్బంది వచ్చి సంతకం తీసుకుని వెళ్లిపోతున్నారని, నగదు మాత్రం అందించడం లేదని వాపోయారు. గతంలో చేసిన అర్జీలు చూపించడంతో అర్జీ నమోదు చేయకుండా రూం.6కు వెళ్లాలంటూ సూచిస్తున్నారని, అక్కడికి వెళ్లినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ పథకాలపై అర్జీలకు నిరాకరణ
తమ సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌కు వస్తున్న అర్జీదారులకు అధికారులు పెడుతున్న షరతులు విసిగితెప్పిస్తున్నాయి. వెంట తెచ్చుకున్న బ్యాగులు, చేతిలో ఫిర్యాదులను పరిశీలించిన తరువాతనే లోపలికి అనుమతిస్తున్నారు. ప్రధాన ద్వారం వద్ద క్యూలో నిల్చున్న అర్జీదారుల వద్ద ఉన్న ఫిర్యాదు స్వరూపం ఆధారంగా ఆయా శాఖలకు రిఫర్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వ పథకాలైన తల్లికి వందనం, పింఛన్లు, అన్నదాత సుఖీభవ వంటి వాటిపై అర్జీలను పీజీఆర్‌ఎస్‌లో నమోదు చేయకుండా గ్రామ, వార్డు సచివాలయ కార్యాలయం(రూమ్ నెం.6)కు వెళ్లాలంటూ అర్జీదారులను పంపించేస్తున్నారు. పీజీఆర్‌ఎస్‌లో అర్జీలు సమర్పించడానికి వస్తే ఇలా మరో చోటకు వెళ్లమనడమేమిటని అర్జీదారులు ప్రశ్నించినా ఫలితం లేకుండాపోయింది.