
ప్రభుత్వ స్థలాలు ఆక్రమించకుండా చూడాలి
జెడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర
అనకాపల్లి: పంచాయతీల పరిధిలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురి కాకుండా సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర చెప్పారు. కొత్తూరు పంచాయతీ పరిధిలో కొత్తూరు, ముత్రాస్ కాలనీల్లో సోమవారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొత్తూరు పరిధిలో జిల్లా పరిషత్‌కు సంబంధించిన 12 ఎకరాల స్థలం ఉందని, ఇందులో మూడు ఎకరాలను ముత్రాస్ కాలనీ హైస్కూల్‌కు కేటాయించే విషయం పరిశీలిస్తున్నామని చెప్పారు. మిగిలిన స్థలాన్ని కొంతమంది వ్యక్తులు ఆక్రమించారని, దీనిపై పంచాయతీ అధికారులు దృష్టి పెట్టాలని ఆమె కోరారు. పట్టణ పరిధిలో జిల్లా పరిషత్ అతిథి గృహాన్ని ఆర్డీవో కార్యాలయంగా మార్చారని, కొత్తూరులో కొత్తగా ఆర్డీవో కార్యాలయం నూతన భవనాన్ని ఏర్పాటు చేశారని, 10 రోజుల్లో కొత్త భవనంలోనికి ఆర్డీవో కార్యాలయాన్ని తరలించాలని ఆమె కోరారు. ఎంపీపీ గొర్లి సూరిబాబు, ఎంపీడీవో పి.ఆశాజ్యోతి, జిల్లా పరిషత్ వైస్ చైర్‌పర్సన్ బి.వి.సత్యవతి, జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు పెతకంశెట్టి శివసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.