
కూటమి సిగపట్లు
పెత్తనం కోసం ఎమ్మెల్యే పంచకర్ల..
టీడీపీ ఇన్‌చార్జి గండి బాబ్జి పాట్లు
ఒకరిపై ఒకరు తమ తమ అధిష్టానానికి
ఫిర్యాదులు
మీడియా ముఖంగా బహిర్గతం చేసిన
గండి బాబ్జి
పెందుర్తిలో
పెందుర్తి: ‘నేను పెందుర్తి ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేని. నా మీద టీడీపీ ఇన్‌చార్జిని వేసి అతనికీ అధికారాలు ఇస్తామంటే ఎలా. ప్రతీ అధికారిక సమావేశానికి ఇన్‌చార్జిలు వచ్చి పెత్తనం చేయడం ఏంటి. నియోజకవర్గంలో కూడా మాకు తెలియకుండా టీడీపీ నేతలు పనులు చేయించుకుంటున్నారు. పార్టీ ఇన్‌చార్జిలు అధికారిక కార్యక్రమాలు నిర్వహించడం ఏంటి. ఇదేనా కూటమి పొత్తు ధర్మం’ రెండు నెలల క్రితం వీఎంఆర్‌డీఎ వేదికగా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు చేసిన వ్యాఖ్యల సారంశం.
‘నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కలిసి పనిచేస్తేనే కూటమి అభ్యర్థి గెలిచారు. వారికి ప్రజా సమస్యలపై ఎంత బాధ్యత ఉందో మాకు అంతే బాధ్యత ఉంది. పేదలకు, దళితులకు అన్యాయం చేస్తూ అభివృద్ది చేస్తామంటే మేం ఒప్పుకోం. పేదల పక్షాల నిలబడితే అభివృద్ధికి అడ్డుపడుతున్నామంటూ మాపై అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. కూటమిగా అధికారంలో ఉండి ఇలాంటి చర్యలకు కొందరు పాల్పడడం మా దౌర్భగ్యం’ సబ్బవరంలో మీడియా ముఖంగా టీడీపీ ఇంచార్జి గండి బాబ్జి వాఖ్యలు ఇవి.
పెందుర్తి నియోజకవర్గంలో అధికార కూటమి నాయకులైన జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, టీడీపీ ఇన్‌చార్జి గండి బాబ్జి మధ్య ఆధిపత్య పోరు తీవ్రమైంది. ఇద్దరు నాయకులు బహిరంగంగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు కలిసి హాజరవుతున్నప్పటికీ, లోపల మాత్రం వారి మధ్య విభేదాలు ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా నియోజకవర్గంలోని వివాదాస్పద పనుల విషయంలో ఇద్దరూ భిన్నమైన వైఖరి తీసుకుంటూ అధికారులకు ఇబ్బందులు సృష్టిస్తున్నారని సమాచారం. తమ చెప్పుచేతల్లో అధికార యంత్రాంగాన్ని పెట్టుకోవడానికి ఇద్దరూ తీవ్రంగా పోటీ పడుతున్నారు. పంచకర్ల రమేష్ బాబు తాను ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి సుప్రీం అని భావిస్తుండగా, గండి బాబ్జి ఎన్నికల్లో తన కృషికి ఫలితంగా విజయం దక్కిందని, ఎమ్మెల్యేతో సమానంగా గౌర వం కావాలని పట్టుబడుతున్నారు. రెండు నెలల క్రితం వీఎంఆర్‌డీఏ సమీక్షలో కూడా వారి మధ్య వివాదం తలెత్తినట్లు సమాచారం. తాజాగా, సబ్బవరంలో ఒక అభివృద్ధి పని విషయంలో ఇరువురి మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. దీనిపై గండి బాబ్జి శనివారం మీడియా ముందు మాట్లాడుతూ, ‘పేదల భూములు లాక్కొని అభివృద్ధి చేస్తారా? నేను బాధితుల తరఫున మాట్లాడితే, మా పొత్తులో ఉన్నవారే మా అధిష్టానానికి నాపై ఫిర్యాదులు చేస్తున్నారు. ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాం’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు పెందుర్తి నియోజకవర్గంలో కూటమి నాయకుల మధ్య సఖ్యత లేదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
తొలి నుంచీ తలో దారే
పెందుర్తిలో జరుగుతున్న ప్రతీ అంశంలోనూ ఎమ్మెల్యే పంచకర్లకు, గండి బాబ్జికి మద్య సఖ్యత ఉండడం లేదన్నది బహిరంగ రహస్యమే. ఇటీవల కాలంలో వీరి మద్య మరింత దూరం పెరిగింది. పెందుర్తి పీఏసీఎస్ చైర్మన్‌గా పంచకర్ల సిఫార్సుతో జనసేన నాయకుడు అయిత సింహాచలంని నియమించారు. నెల రోజుల క్రితం జరిగిన చైర్మన్ ప్రమాణ స్వీకారానికి కూటమిలోనే ఉన్న గండి బాబ్జి ముఖ్యం చాటేశారు. అతనితో పాటు టీడీపీ నాయకులెవరూ ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. చివరకు పీఏసీఎస్ సభ్యుడిగా నియమితులైన చిరికి అవతారం కూడా కార్యక్రామనికి హాజరు కాలేదు(తరువాత పీఏసీఎస్ కార్యాలయంలో బాధ్యత స్వీకరించారు). ఈ క్రమంలో పెందుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా టీడీపీ ఇంచార్జి గండి బాబ్జీ లేఖతో అతని అనుచరుడు అవగడ్డ అప్పలనాయడు భార్య జ్యోతిని నియమించారు. అయితే జ్యోతి ప్రమాణ స్వీకారం చేస్తున్న సభకు కేవలం కిలో మీటర్ దూరం వరకు వచ్చిన పంచకర్ల రమేష్‌బాబు సహా జనసేన కేడర్ అంతా వెనుదిరిగారు. ఇక పంచకర్ల అనుచరులు చింతగట్లలో ఐదెకరాల భూమిపై కన్నెసి తప్పుడు పత్రాలు సృష్టిస్తే దాన్ని గంబి బాబ్జీ వర్గీయులు అడ్డుకున్నట్లు బహిరంగంగానే చర్చ జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే తాజాగా నియోజవర్గంలో పరిణామాల బట్టి పంచకర్ల రమేష్‌బాబు, గండి బాబ్జీ పోరు తారాస్థాయికి చేరుకున్నట్టే కనిపిస్తుంది.
ఆధిపత్య పోరు
పెందుర్తి నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, టీడీపీ ఇన్‌చార్జి గండి బాబ్జి మధ్య ఎన్నికల నుంచే కొనసాగుతున్న ఆధిపత్య పోరు ఇప్పుడు అధికారులకి పెద్ద తలనొప్పిగా మారింది. వీరిద్దరూ అధికారంలోకి రావడమే లక్ష్యంగా కలిసి పనిచేశారు తప్ప, వారి మధ్య విభేదాలు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి.
అధికారుల బదిలీలు, ఒత్తిళ్లు
అధికారం చేపట్టిన వెంటనే అధికారుల బదిలీల విషయంలోనే ఈ ఇద్దరు నాయకుల మధ్య విభేదాలు మొదల య్యాయి. పంచకర్లకు పోటీగా గండి బాబ్జి కూడా తన సిఫార్సులను అధికారులకు పంపారు. బాబ్జికి జిల్లా.. రాష్ట్రస్థాయి నాయకులతో ఉన్న పరిచయాల కారణంగా ఆయన సిఫార్సులకు ప్రాధాన్యత లభించడం, పంచకర్ల సిఫార్సులు కొన్నిసార్లు అమలు కాకపోవడం ఆయన అసహనానికి కారణమైంది. అంతేకాకుండా, ఎమ్మెల్యేకు పోటీగా బాబ్జి ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడం, పీజీఆర్‌ఎస్ కార్యక్రమాలు చేపట్టడం, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం వంటివి కూడా పంచకర్లకు మరింత కోపం తెప్పించాయి. ఈ కోపాన్ని ఇద్దరు నాయకులు అధికారులపై చూపుతున్నారు. ఒకే పని విషయంలో ఒకరు ‘వద్దు’ అంటే, మరొకరు ‘చేయాలి’ అని తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తుండటంతో అధికారులు ఎవరి మాట వినాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు.
ప్రజలకు మేలు చేసేదెవరు?
ఈ ఆధిపత్య పోరులో ప్రజల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఈ 15 నెలల కాలంలో ఇద్దరు నేతలు తమ తమ పార్టీల నాయకులకు, కార్యకర్తల కోసం మాత్రమే పనిచేశారని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీర్ఘకాలికంగా ఉన్న ప్రజా సమస్యలను పరిష్కరించడానికి బదులుగా, కేవలం తమ కార్యకర్తలకు మేలు చేయడానికి, వారు కేసుల్లో ఇరుక్కుంటే కాపాడడానికి, ప్రభుత్వ భూముల ఆక్రమణలను అడ్డుకోవడానికి మాత్రమే ఈ నేతలు ఉత్సాహం చూపిస్తున్నారని ప్రజలు ఆక్షేపిస్తున్నారు. ఈ నేతల వేధింపులు తాళలేక చాలా మంది అధికారులు బదిలీలపై వెళ్లిపోయారని కూడా ఆరోపణలు ఉన్నాయి. తమకు నచ్చని అధికారులను వేధించి బదిలీ చేయించడం కోసం మాత్రమే ఈ నేతలు అధికారాన్ని పంచుకుంటున్నారని పెందుర్తి ప్రజలు మండిపడుతున్నారు.