
‘న్యాయవాదుల రక్షణకు చట్టాలను తీసుకురావాలి’
అనకాపల్లి: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో న్యాయవాదులపై దాడులు అంతకంతకు పెరిగిపోతున్నాయని ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.ఎస్.అజయ్‌కుమార్ తెలిపారు.న్యాయవాదుల రక్షణకు తగిన చట్టాలను తీసుకురావాలన్నారు. స్థానిక గాంధీనగరం అసోసియేషన్ ఫర్ జస్టిస్ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అనకాపల్లిలో ఉన్న కోర్టుల్లో కనీస సదుపాయాలు కరవయ్యాయని, న్యాయమూర్తులు, కలెక్టర్ వెంటనే స్పందించి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన కోరారు. న్యాయస్థానాల్లో మౌలిక వసతులు, ఇతర సమస్యలపై న్యాయ, మున్సిపల్ శాఖలకు లేఖలు రాయాలని తీర్మానం చేసినట్టు చెప్పారు. న్యాయవాది ఐ.ఆర్.గంగాధర్ మాట్లాడుతూ కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల రక్షణకు చట్టాన్ని తీసుకువచ్చిందని, రాజస్థాన్ రాష్ట్ర శాసనసభలో కూడా బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించారని చెప్పారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా చట్టాలు తీసుకురావలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఇళ్ల అవినాష్ , ఓడిబోయిన రాంబాబు, చిట్టా జయశ్రీ, జి. బాలప్రభ, వడిసెల కస్తూరి తదితరులు పాల్గొన్నారు.