
మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేయొద్దు
అనకాపల్లి: నర్సీపట్నం(మాకవరపాలెం) సహా రాష్ట్రంలోని పది కొత్త మెడికల్ కళాశాలలను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్(పీపీపీ) విధానంలో నిర్మించాలని విడుదల చేసిన జీవో నంబర్ 590ను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా, ఆరోగ్య రంగాన్ని లాభాపేక్ష కోసం ప్రైవేట్ సంస్థలకు అప్పగించే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. మాకవరపాలెంలో మెడికల్ కాలేజీ భవన నిర్మాణాలు గత ప్రభుత్వ హయాంలోనే చివరి దశలో ఉన్నాయని, వీటిని పూర్తి చేసి వైద్య సేవలు వెంటనే ప్రారంభించే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం 10 మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటుపరం చేయాలనుకోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే వైద్య కళాశాలలు ప్రతిభకు, సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తాయని, ప్రైవేట్ యాజమాన్యాలు సంపన్నులకే సీట్లు కేటాయిస్తాయని, వ్యాపార దృక్పథం పేద ప్రజలకు వైద్యం అందకుండా చేస్తుందన్నారు. వైద్య విద్య, ఆరోగ్యం ప్రజా హక్కులను లాభాల కోసం తాకట్టు పెట్టడం సరైన పద్ధతి కాదన్నారు. ఇప్పటికే ప్రైవేటు మెడికల్ కాలేజీల ఫీజుల భారం వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య అందని పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వమే కొత్త మెడికల్ కాలేజీలను పూర్తిగా నిర్మాణం చేపట్టి, ప్రజలకు వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.