
మిత్రులతో వెళ్లాడు.. శవమై తేలాడు..
నర్సీపట్నం: మిత్రులతో కలిసి వెళ్లిన ఓ యువకుడు శవమై తేలాడు. తమ కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని పాత సంతబయలకు చెందిన రామిశెట్టి భాస్కర్(34) ఈ నెల 8న ఇంటికి వచ్చిన ముగ్గురు స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో ఆయన తల్లి లక్ష్మీ టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. భాస్కర్ సెల్‌ఫోన్ సిగ్నల్స్ నాతవరం మండలం డి.ఎర్రవరం వద్ద ఉన్నట్టు గుర్తించారు. కుటుంబ సభ్యులు ఆ ప్రాంతంలో గాలింపు చేసినా ఫలితం లేకపోయింది. కోటవురట్ల రూట్‌లో జోగినాథునిపాలెం సీసీ కెమెరాల్లో ఆయన కదలికలు రికార్డు అయ్యాయి. ఆ మార్గంలో బంధువులు గాలింపు చేయగా ఆర్ అండ్ బీ రోడ్డు కల్వర్టు కింద భాస్కర్ మృతదేహాన్ని గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహావేశాలకు గురయ్యారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ ఎదుట రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. సుమారు గంట పాటు నర్సీపట్నం–చింతపల్లి మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. భాస్కర్ మరణంపై అనుమానాలు ఉన్నాయని, సమగ్ర విచారణ చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. భాస్కర్‌ను ఇంటి నుంచి తీసుకెళ్లిన స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారించాలని నినాదాలు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. భాస్కర్‌ను తీసుకువెళ్లిన వ్యక్తులు స్థానికంగా లాడ్జీలో ఉన్నట్టుగా తమ దృష్టికి వచ్చిందని, దీనిపై విచారణ చేస్తున్నామన్నారు.

మిత్రులతో వెళ్లాడు.. శవమై తేలాడు..