
యూరియా కొరతతో రైతులకు ఇబ్బందులు
గొలుగొండ: యూరియా కొరత వల్ల మండలంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వ్యవసాయ శాఖ అధికారులు సరైన సమాధానం చెప్పకుండా తప్పుదోవ పట్టిస్తున్నారని మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపీ మణికుమారి అధ్యక్షతను స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పుత్తడిగైరంపేట సర్పంచ్ పత్తి రమణ, నాగాపురం సర్పంచ్ యలమంచిలి రఘురాం ఎరువుల కొరతపై నిలదీశారు. వ్యవసాయశాఖ అధికారులు సరిగా స్పందించకపోవడం వల్లే ఈ సమస్య వస్తుందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో రైతులు కష్టాలు చాలా ఎక్కవగా ఉన్నాయని వాపోయారు. ఎంపీపీ మణికుమారి మాట్లాడుతూ మండలంలో సాగు విస్తీర్ణం, ఎంతమేర ఎరువులు అవసరం, ఇప్పటి వరకు ఎంతమేర వచ్చాయని వ్యవసాయ అధికారులను అడిగితే సరైన సమాచారం ఇవ్వలేదని వాపోయారు. మండలంలో ఎరువుల కొరత వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. గొలుగొండలో తాగునీటి సమస్య గురించి సర్పంచ్ కసిపల్లి అప్పారావు, నాగాపురం ప్రభుత్వ పాఠశాలలో సమస్యల గురించి సర్పంచ్ రఘురాం ప్రస్తావించారు. ఇన్‌చార్జి ఎంపీడీవో బాబూరావు, వైస్ ఎంపీపీ జక్కు నాగమణితోపాటు పలువులు పాల్గొన్నారు.