వలిసె విలాపం | - | Sakshi
Sakshi News home page

వలిసె విలాపం

Sep 13 2025 4:27 AM | Updated on Sep 14 2025 3:06 AM

వలిసె విలాపం

వలిసె విలాపం

ఏటా తగ్గిపోతున్న సాగు విస్తీర్ణం

ఫలించని శాస్త్రవేత్తల ప్రయత్నాలు

పర్యాటక ప్రాంతాల్లో తగ్గనున్న శోభ

సంప్రదాయ విత్తనాల వల్ల దిగుబడి తగ్గుదల

అధిక వర్షాల వల్ల ఈ ఏడాది ఆలస్యంగా సాగు

ప్రభుత్వ ప్రోత్సాహం కరువు

మన్యం పేరు చెబితే ప్రకృతి అందాలకు నిలయమే కాకుండా పచ్చని కొండలు గుట్టల మధ్య పసుపు తివాచీ పరిచినట్లుండే వలిసె పూలు గుర్తుకు వస్తాయి. అందానికే కాకుండా మరో వైపు ఆదాయం ఇచ్చే వాణిజ్య పంటగా వలిసెలకు గుర్తింపు ఉంది. వేరుశనగ తరువాత అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే ఈ పంట విస్తీర్ణం ఏటా తగ్గిపోతుండటం పర్యాటకులకు నిరాశ కలిగిస్తోంది. పర్యాటక సీజన్‌లో మంచు తెరల మధ్య వన్నెలద్దే వలిసె పూలు పూర్వవైభవం కోల్పోయే పరిస్థితులు

నెలకొంటున్నాయి.

చింతపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్‌లో వలిసె సాగు పరిశోధన క్షేత్రం

చింతపల్లి: వలిసె సాగు జిల్లాలో పాడేరు డివిజన్‌లో నూనె గింజల పంటగా గిరిజనులు సాగు చేస్తున్నారు. సంప్రదాయ విత్తనాల వినియోగం, ఆకాశపందిరి కలుపు మొక్క ప్రభావం కారణంగా దిగుబడి తగ్గింది. దీంతో నిరాశకు గురవుతున్న రైతులు ఈ సాగుపై ఆసక్తి చూపడం లేదు.

● రెండు దశాబ్దాల క్రితం 6 వేల ఎకరాలకు పైగా ఉన్న సాగు విస్తీర్ణం ఏటా గణనీయంగా తగ్గిపోతోంది. గత రెండేళ్లలో 1500 నుంచి 1600 ఎకరాలు ఉన్న సాగు విస్తీర్ణం ఇప్పుడు 1200 ఎకరాలకు తగ్గిపోయింది.

కారణాలివీ..

గిరిజన రైతులు సంప్రదాయ విత్తనాలను వినియోగించడం వల్ల దిగుబడి రావడం లేదు. మరోపక్క మార్కెటింగ్‌ సమస్యను ఎదుర్కొంటున్నారు. తేనెటీగలు తగ్గడం కూడా దిగుబడిపై ప్రభావం చూపిస్తోంది. రాజ్‌మా, వరి విత్తనాలను ప్రభుత్వం రాయితీపై అందజేయడం వల్ల ఆ పంటల సాగుపై రైతులు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం లేకపోవడం కూడా గిరి రైతులను నిరాశ పరుస్తోంది.

అనువైన రకాలు

ఎత్తయిన గిరిజన ప్రాంతాల్లో సాగు చేసేందుకు అనువైన రకాలను స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు గుర్తించారు. జేఎన్‌ఎస్‌–28,30, జేఎన్‌ఎస్‌–2016, 1115, కేజీఎన్‌ –2 రకాలు వంద నుంచి 110 రోజుల్లో దిగుబడి వస్తుంది. జేఎన్‌ఎస్‌–6 రకం 110 రోజులు, జేఎన్‌ఎస్‌–9, ఉత్కల్‌ నైజర్‌–150 రకాలు 95 నుంచి వందరోజుల్లో దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

త్వరలో చింతపల్లి నైజర్‌ 1,2 విత్తనాలు

ఇక్కడి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో వలిసెలపై ప్రత్యేకంగా జాతీయ ప్రాజెక్ట్‌ అమలు అవుతోంది.ఇక్కడ వేల రకాల విత్తనాలపై 2018 నుంచి పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ ప్రాంత వాతావరణ పరిస్థితులు అనుకూలంగా చింతపల్లి నైజర్‌ 1,2 రకాలు ఉన్నట్టు చింతపల్లి గుర్తించారు. వీటిపై పరిశోధనలు మరో రెండేళ్లు జరిపిన అనంతరం రైతులకు పంపిణీ చేస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఈ ఏడాది ఆలస్యంగా..

ఈ ఏడాది ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తునందున సాగు ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఏటా ఆగస్టు నెలాఖరు, సెప్టెంబర్‌లో సాగు మొదలు పెడతారు. నవంబర్‌ నుంచి పూత వస్తుంది. జనవరి నాటికి దిగుబడి వస్తుంది. అయితే ఈ ఏడాది ఇప్పటివరకు సాగు చేపట్టిన పరిస్థితులు కనిపించలేదు.

అగ్రీ టూరిజంలో సంకల్పించినా..

సాగు విస్తీర్ణం పెంచే చర్యల్లో భాగంగా రెండేళ్ల క్రితం చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు అగ్రిటూరిజంలో ఈ పంటను చేర్చారు. రైతులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా ప్రయోజనం లేకపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే మన్యానికి శోభనిచ్చే వలిసె పూలు భవిష్యత్తులో పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితులు లేకపోలేదు.

వలిసె పూల మకరందాన్ని సేకరించే తేనెటీగలు పరాగ సంపర్కంలో కీలక పాత్ర పోషిస్తాయి, ఇది పంటల దిగుబడికి మరియు కొత్త మొక్కల పెరుగుదలకు సహాయపడుతుంది. వలిసె తోటల వద్ద తేనెటీగలు చేరడం సహజమే అయినా, ఇటీవలి కాలంలో తేనెటీగల సంఖ్య తగ్గడం వల్ల దిగుబడి తగ్గి గిరిజన రైతులకు నష్టం కలిగిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement