
‘కేంద్ర ప్రభుత్వ పథకాలు సామాన్యులకు చేరాలి’
జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం
తుమ్మపాల: జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) మాసాంతపు సమావేశం శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగింది. దిశ కమిటీ చైర్మన్, ఎంపీ రమేష్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, కలెక్టర్ విజయ కృష్ణన్, ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, సుందరపు విజయకుమార్, పంచకర్ల రమేష్ బాబు, బండారు సత్యనారాయణమూర్తి పాల్గొని జిల్లా అధికారులతో వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు పేద ప్రజలకు అందేలా చూడవలసిన బాధ్యత జిల్లా అధికార యంత్రాంగంపై ఉందని ఎంపీ రమేష్ అన్నారు. యూరియా పంపిణీ, సంక్షేమం, అభివృద్ధి గురించి కమిటీ సభ్యులకు కలెక్టర్ వివరించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ అనకాపల్లి, యలమంచిలి రైల్వే స్టేషన్ల సాఫ్ట్ అప్‌గ్రెడేషన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ యూరియా అమ్మకం, పంపిణీలో బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలన్నారు. డీఆర్వో సత్యనారాయణరావు, జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి, ఏఎస్పీ ఎం.దేవప్రసాద్, ఆర్డీవోలు, షేక్ ఆయిషా, వి.వి.రమణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎంపీపీలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.