
మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఘాతుకం
తలకు తీవ్రగాయమవడంతో ఘటనా స్థలిలోనే మృతి
నాతవరం(అనకాపల్లి జిల్లా): మద్యం కోసం కన్నతల్లినే కడతేర్చాడు. మండలంలో వైబీ పట్నంలో మద్యం మత్తులో తల్లిని చంపిన ఘటన సంచలనంగా మారింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన చిటికిల జోగునాయుడు, మంగ దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తెకు వివాహం కాగా కొడుకు రామ్మూర్తినాయుడు మాకవరపాలెం మండలానికి చెందిన అమ్మాయిని çప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో కుమారుడు వ్యసనాలకు బానిసై మద్యం తాగడానికి డబ్బులివ్వాలంటూ ఇంట్లో తరచూ గొడవ పడేవాడు. భర్త వే«ధింపులు భరించలేక భార్య దేవి నాతవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తల్లిదండ్రులు కూడా పలు మార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రామ్మూర్తినాయుడు హైదరాబాద్ వెళ్లిపోయాడు. గురువారం మరిడమ్మతల్లి పండగ కావడంతో గ్రామానికి వచ్చాడు. రాత్రి ఒంటి గంట వరకు మద్యం తాగి వైబీ పట్నంలోని తన ఇంటికి వచ్చాడు. మళ్లీ డబ్బుల కోసం తండ్రితో గొడవపడ్డాడు. మద్యం మత్తులో ఉన్న కొడుకు పరిస్థితి గమనించిన ఆయన అక్కడి నుంచి తప్పించుకోగా, నిద్రిస్తున్న తల్లి మంగను కొట్టి డబ్బులడిగాడు. మంచం పైనుంచి కింద పడేసి పక్కనే ఉన్న పూల కుండీతో తలపై బలంగా కొట్టాడు.
దీంతో తల్లి స్పృహ తప్పి అపస్మార స్థితికి చేరుకుంది. ఆమె మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడు, శతమానం లాక్కుని పారిపోయాడు. ఇరుగుపొరుగు వారు వచ్చి చూసేసరికి మంగ మరణించింది. మృతురాలి భర్త జోగునాయుడి ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, మృతదేహాన్ని పరిశీలించారు. నిందితుడిని అదుపులోని తీసుకున్నామని, దర్యాప్తు అనంతరం అరెస్ట్ చేయనున్నట్లు నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.