
అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో ఆందోళన చేస్తున్న మత్స్యకారులు
హోంమంత్రి అనితపై రాజయ్యపేట మత్స్యకారుల ఆగ్రహం
నక్కపల్లి (అనకాపల్లి జిల్లా): ‘ఓట్ల కోసం వచ్చినప్పుడు కాళ్లా వేళ్లాపడ్డావు. మీ ఆడపిల్లనన్నావు. రాజయ్యపేట నా పుట్టినిల్లు అనుకుంటానని నమ్మబలికావు. నిన్ను నమ్మి నక్కపల్లి మండలంలో ఏ గ్రామంలోనూ రాని విధంగా రాజయ్యపేటలో టీడీపీకి 2వేల ఓట్ల మెజార్టీ ఇచ్చాము.
ఇంతలా ఆదరించిన మత్స్యకారుల రుణం బాగానే తీర్చుకున్నావు అనితమ్మా... మా రాజయ్యపేటని బల్క్ డ్రగ్ పార్క్ కోసం అమ్మేశావా? ఆరు నెలల నుంచి బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేయాలంటూ గంగపుత్రులు ఆందోళన చేస్తుంటే మా గోడు వినేందుకు కూడా నీకు తీరిక లేదా...’ అంటూ అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట మత్స్యకారులు హోంమంత్రి వంగలపూడి అనితపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాజయ్యపేట సమీపంలో నిర్మిస్తున్న బల్క్ డ్రగ్ పార్క్‌ను నిలిపివేయాలని మత్స్యకారులు ఆదివారం శాంతియుతంగా చేపట్టిన సమావేశాన్ని పోలీసులు అడ్డుకున్నారు. సమావేశం కోసం తెచ్చిన టెంట్లపై పోలీసు జీపులను నిలబెట్టారు. దీంతో మత్స్యకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడే ధర్నాకు కూర్చున్నారు.
ప్రజల ప్రాణాలకు ముప్పు.. మత్స్య సంపద నాశనం..
ప్రభుత్వం రాజయ్యపేట సమీపంలో 2వేల ఎకరాల్లో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో బల్క్ డ్రగ్ పార్క్ నిరి్మస్తోంది. ఈ బల్క్ డ్రగ్ పార్క్ వల్ల మత్స్యకారులు, సమీప ప్రాంతాల్లో నివసించేవారి ప్రాణాలకు పుప్పు వాటిల్లుతుందని, సముద్రంలోకి వేసే పైపులైన్ల వల్ల మత్స్య సంపద నాశనమవుతుందని రాజయ్యపేట, బోయపాడు, దొండవాక తదితర గ్రామాల మత్స్యకారులు ఆందోళనలు చేస్తున్నారు.
ప్రభుత్వం పట్టించుకోకుండా పనులు కొనసాగిస్తోంది. దీంతో మత్స్యకారులు పనులు చేసే చోట శాంతియుతంగా నిరాహార దీక్షలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పోలీసులకు దరఖాస్తు చేశారు. పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆదివారం గ్రామçస్తులు సముద్రం ఒడ్డున సమావేశం కాగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడే ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష చేశారు.
మత్స్యకార నాయకుడు ఎరిపిల్లి నాగేశు తదితరులు పాల్గొన్నారు. సీపీఎం నాయకులు మత్స్యకారులకు సంఘీభావం తెలిపారు. 13మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అర్ధరాత్రి దాటిన తరువాత పోలీసులు మరోమారు నోటీసులతో గ్రామంలోకి రావడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు.