
రైతులకు సంపూర్ణ స్థాయిలో యూరియా సరఫరా చేయాలి
చోడవరం: జిల్లాలో రైతులకు అవసరమైనంత యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలమయ్యిందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చోడవరంలో ఏపీ రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు కర్రి అప్పారావు, జిల్లా ప్రధానకార్యదర్శి ఎం. అప్పలరాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి. వెంకన్న ఆదివారం విలేరులతో మాట్లాడారు. రాష్ట్రంలో యూరియా కొరత లేదని ముఖ్యమంత్రి ప్రకటనలు చేస్తున్నప్పటికీ గ్రామాల్లో ఎక్కడా రైతులకు పూర్తిస్థాయిలో యూరియా ఎరువులు అందడం లేదని వారు ధ్వజమెత్తారు. జిల్లాలో 891మెట్రిక్ టన్నులుఅందుబాటులో ఉందని, మరో 1500 మెట్రిక్ టన్నులు అవసరమౌతాదని అధికారులే చెబుతున్నప్పటికీ ఆ స్థాయిలో యూరియా సరఫరా కాలేదన్నారు. అధికారిక లెక్కలు ప్రకారం ఇంత యూరియా అందుబాటులో ఉంటే ఎందుకు రైతులకు ఇవ్వడం లేదని వారు ప్రశ్నించారు. రైతు సేవాకేంద్రాలు, కోఆపరేటివ్ సొసైటీల ద్వారా మరింత ఎక్కువ యూరియాను సరఫరా చేసి రైతులకు విక్రయించాలని వారు డిమాండ్ చేశారు. బ్లాక్ మార్కెట్ షాపులపై దాడులు చేయాలన్నారు. రైతులకు అవసరమైనంత యూరియా సరఫరా చేయకపోతే రైతుల నుంచి ఉద్యమం చేపడతామని వారు హెచ్చరించారు.