
ఎ.కొత్తపల్లిలో ప్రొటోకాల్‌కు తూట్లు
● కొత్త పింఛన్లపై సర్పంచ్, ఎంపీపీకి అందని సమాచారం ● టీడీపీ నాయకులతో కలిసి లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ ● వివాదాస్పదంగా మారిన సచివాలయ ఉద్యోగుల తీరు
దేవరాపల్లి: మండలంలోని ఎ.కొత్తపల్లి సచివాలయం పరిధిలోని ఉద్యోగులు ప్రొటోకాల్‌కు తూట్లు పొడిచారు. స్థానిక సచివాలయం పరిధిలో నూతనంగా మంజూరైన వితంతు పింఛన్లపై స్థానిక సర్పంచ్ చింతల సత్య వెంకటరమణ, స్థానిక ఎంపీపీ చింతల బుల్లిలక్ష్మీకి సైతం కనీస సమాచారం ఇవ్వకుండా టీడీపీ నాయకులతో కలిసి శుక్రవారం పింఛన్ల పంపిణీ చేయడం వివాదాస్పదమైంది. గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్, మండల ప్రథమ పౌరురాలు ఎంపీపీకి సమాచార ఇవ్వకుండా తమ గ్రామంలో ఎలా పింఛన్లు పంపిణీ చేపడుతున్నారని ఎంపీడీవో ఎం.వి.సువర్ణరాజు దృష్టికి సర్పంచ్, ఎంపీపీ తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎంపీడీవో, పరిపాలన అధికారి డి.వి.లక్ష్మీనారాయణ ఏ.కొత్తపల్లి సచివాలయానికి చేరుకొని స్థానిక ఉద్యోగులతో సమావేశమయ్యారు. సిబ్బందిని మందలించారు. ప్రొటోకాల్ పాటించకుండా ఇష్టానుషారం వ్యవహరిస్తే తదుపరి చర్యలకు బాధ్యులవుతారని హెచ్చరించారు. మళ్లీ ప్రొటోకాల్ సమస్యలు పునరావృతం కాకుండా చూసుకుంటామని ఎంపీడీవో సర్ది చెప్పడంతో సర్పంచ్, ఎంపీపీ శాంతించారు.