
స్నేహమేరా జీవితం..
అనకాపల్లి: సాధారణంగా రైల్లో కలిసే స్నేహాలు, అనుబంధాలు తాత్కాలికం అంటారు. కలిసి ప్రయాణిస్తూ ఎంతో ఆత్మీయంగా మాట్లాడుకున్న వారు సైతం రైలు దిగిన వెంటనే ఒకరినొకరు మరచిపోతారు. ఎవరి పనుల్లో వారు నిమగ్నమవుతారు. కానీ వీరు అలా కాదు.. ప్రతి రోజూ ఒకే రైల్లో ప్రయాణించడం వల్ల కాబోలు వారి స్నేహాన్ని శాశ్వతం చేసుకున్నారు. బెస్ట్ ఫ్రెండ్స్ క్లబ్ స్థాపించి కుటుంబ సభ్యులతో సహా అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. అనకాపల్లి పట్టణంలో లక్ష్మీదేవిపేట గ్రామానికి చెందిన మాదేటి ఈశ్వరరావు వ్యాపారరీత్యా అనకాపల్లి–విశాఖ డైలీ పాసింజర్ రైల్లో నిత్యం ప్రయాణించేవారు. అలా అనకాపల్లి నుంచి విశాఖ వచ్చే ఉద్యోగులు, విద్యార్థులు, చిరు వ్యాపారులు ఆయనకు ఎంతో దగ్గరైపోయారు. అలా మిత్రులైన తోటి ప్రయాణికులతో కలిసి 2000 సంవత్సరంలో బెస్ట్ ఫ్రెండ్స్ క్లబ్‌ను ఏర్పాటు చేశారు. క్లబ్‌లో బుద్ద రామకృష్ణ, పెంటకోట నర్సింగరావు, కర్రి గంగాధర్, పి.ఎస్.అప్పారావుతోపాటు 60మంది స్నేహితులతో కలిసి క్లబ్ స్థాపించారు. కుటుంబ సమేతంగా సభ్యులుగా చేరారు. ప్రస్తుతం 500 కుటుంబాల వారు ఈ క్లబ్‌లో ఉన్నారు. వీరు ప్రతి ఏడాది స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడమే కాక అనేక ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత ప్రసాదాల వితరణ చేస్తారు. ఆస్పత్రుల్లో రోగులకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేస్తారు. క్లబ్‌లో సభ్యుల జన్మదినాన్ని పురస్కరించుకుని వారి ఇంటికి ప్రత్యేక గిఫ్ట్ పంపిస్తారు. స్నేహితుల దినోత్సవానికి 15 రోజుల ముందుగా క్లబ్ సభ్యులకు రన్నింగ్, క్రికెట్ వంటి ఆటలు పోటీలు నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా స్నేహితుల దినోత్సవాన్ని స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారి రహదారిలో ఉన్న సత్య గ్రాండ్ ఫంక్షన్ హాల్లో ఆదివారం కుటుంబ సమేతంగా నిర్వహిస్తున్నట్టు క్లబ్ అధ్యక్షుడు బి.ఎస్.ఎం.కె.జోగినాయుడు చెప్పారు.
రైలు ప్రయాణికులే సభ్యులుగా బెస్ట్ ఫ్రెండ్స్ క్లబ్ ఏర్పాటు
అనకాపల్లిలో 25 సంవత్సరాలుగా కొనసాగుతున్న స్నేహం

స్నేహమేరా జీవితం..