
రైలు ఢీకొని మహిళ మృతి
యలమంచిలి రూరల్ : వివాహ వేడుకకు వస్తూ రైల్వే ట్రాక్ దాటుతున్న మహిళను గుర్తు తెలియని రైలు బండి ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో యలమంచిలి రైల్వేస్టేషన్ ఒకటో నెంబరు ప్లాట్‌ఫాం సమీపంలో చోటు చేసుకుంది. విశాఖపట్నం తుంగ్లాం ప్రాంతానికి చెందిన కొల్లి రమణమ్మ(55), మరో ముగ్గురు బంధువులతో కలిసి యలమంచిలి రాంనగర్‌లో జరుగుతున్న ఓ వివాహానికి హాజరుకావడానికి ఆదివారం రాత్రి వచ్చారు. ఆటోలో యలమంచిలి రైల్వేస్టేషన్ వరకు వచ్చి రాంనగర్‌లో జరుగుతున్న వివాహ వేదిక చిరునామా సరిగ్గా తెలియకపోవడంతో తికమక పడ్డారు. చివరకు బంధువులకు ఫోన్ చేయగా రైల్వేస్టేషన్ చివర రైలు పట్టాలు దాటితే సులభంగా వివాహ వేదిక వద్దకు చేరుకోవచ్చని చెప్పారు. దీంతో మృతురాలితో పాటు ఇద్దరు మహిళలు, మనుమరాలు రైల్వే ట్రాక్ దాటుతుండగా అదే ట్రాక్‌పై అనకాపల్లి నుంచి తుని వైపు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు వేగంగా వస్తోంది. వారిలో ఇద్దరు రైలుపట్టాలు దాటేసరికి రైలు వస్తున్న సంగతిని చెప్పి మిగిలిన ఇద్దరినీ రావద్దని అరిచారు. ఇద్దరిలో ఒక మహిళ రైలు పట్టాల అవతల ఉండిపోగా, కొల్లి రమణమ్మ దాటే ప్రయత్నం చేసింది. అదే సమయంలో కాలి చెప్పు జారిపోవడంతో ఆమెను రైలు ఢీకొట్టినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదంలో రమణమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. రెప్పపాటులో ముగ్గురు మహిళలు ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆనందంగా వివాహ వేడుకకు వచ్చిన రమణమ్మను రైలుబండి రూపంలో తమ కళ్ల ముందే మృత్యువు కబళించడంతో బంధువులు ఘటనా స్థలం వద్ద కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీనిపై డ్యూటీలో ఉన్న స్టేషన్ సిబ్బంది తుని రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. మహిళ మృతి చెందిన రైల్వే ట్రాక్‌పై రైళ్ల రాకపోకలను నిలిపివేశారు.
వివాహ వేడుకకు వస్తూ మృత్యు ఒడికి
రైలు పట్టాలు దాటుతుండగా దుర్ఘటన