
ఫిరాయింపు కార్పొరేటర్లపై వేటు వేయాల్సిందే..
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ సీపీ నుంచి ఫిరాయించిన కార్పొరేటర్లపై అనర్హత వేటు వేయాల్సిందేనని ఆ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు డిమాండ్ చేశారు. ఫిరాయింపు కార్పొరేటర్లపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో వేసిన పిటిషన్‌పై సోమవారం తీర్పు వెలువడనుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 6న జరగనున్న జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికపై ఆ పార్టీ కార్పొరేటర్లతో కె.కె.రాజు సమావేశమయ్యారు. స్టాండింగ్ కమిటీలో పోటీ చేసే కార్పొరేటర్లకు ఎన్నికలో గెలుపునకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక పార్టీ గుర్తుపై గెలిచిన కార్పొరేటర్లు వేరొక పార్టీలోకి ఫిరాయిస్తే అది ప్రజాస్వామ్యానికే విఘాతం కలిగించినట్లవుతుందన్నారు. ‘మా పార్టీ నుంచి ఫిరాయించిన 27 మంది కార్పొరేటర్లపై అనర్హత వేటు అంశం హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. తీర్పు వెలువడితే వారి రాజకీయ భవితవ్యం అగమ్యగోచరంగా మారనుంది. ఇలా ఫిరాయింపుదారులపై వేటు పడితేనే భవిష్యత్తులో ఎవరూ ఫిరాయించరు. ఒకవేళ ఫిరాయింపులకు పాల్పడాలనుకుంటే రాజీనామా చేసి, ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి వెళ్లాలి’అని అన్నారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బానాల శ్రీనివాసరావు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ఫిరాయింపు కార్పొరేటర్ల ఓటు హక్కును రద్దు చేయాలి
వైఎస్సార్ సీపీ నుంచి ఫిరాయించిన కార్పొరేటర్లపై అనర్హత వేటు నిర్ణయం హైకోర్టులో పెండింగ్‌లో ఉండగా.. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలను ఎలా నిర్వహిస్తారని డిప్యూటీ మేయర్ కె.సతీష్, వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ బానాల శ్రీనివాస్ ప్రశ్నించారు. తక్షణమే ఆ కార్పొరేటర్ల ఓటు హక్కును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్లతో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించినప్పుడు ఆ పదవిని రద్దు చేసే అధికారం చట్టబద్ధంగా ఉంటుందన్నారు. వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీ, జనసేన, బీజేపీలోకి ఫిరాయించిన 27 మంది కార్పొరేటర్ల అనర్హత అంశం హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున, స్టాండింగ్ కమిటీ ఎన్నికలు నిర్వహించడం చట్ట విరుద్ధమని తెలిపారు. ఆ 27 మంది ఫిరాయింపు కార్పొరేటర్లకు కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఇప్పటికే నోటీసులు కూడా పంపించారని గుర్తు చేశారు. న్యాయస్థానంలో కేసు పెండింగ్‌లో ఉండగా వారికి ఓటు హక్కు కల్పించడం నిబంధనలకు విరుద్ధమని, ఒకవేళ ఎన్నిక నిర్వహించినా అది చెల్లదని హెచ్చరించారు.
అప్రజాస్వామికంగా మేయర్ ఎన్నిక
పార్టీ ఫిరాయించిన కార్పొరేటర్లతో అప్రజాస్వామికంగా కొత్త మేయర్‌ను ఎన్నుకున్నారని వారు ఆరోపించారు. ప్రజాస్వామ్యానికే తలవంపులు తెచ్చిన జంప్ జిలానీలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ప్రజా పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశామన్నారు. కొత్త మేయర్ బాధ్యతలు స్వీకరించి వంద రోజులు కాకముందే ఆయన పనితీరు, అక్రమాలపై నగర ప్రజలు అసంతృప్తిగా ఉన్నారన్నారు. గత మేయర్ పాలనే బాగుందని నగర ప్రజలు భావిస్తున్నారన్నారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని, ఎన్నికల నియమ నిబంధనలను ముందుగా పోటీలో ఉన్న కార్పొరేటర్లకు తెలియజేయాలని కోరారు. సమావేశంలో స్టాండింగ్ కమిటీ ఎన్నికల బరిలో ఉన్న కార్పొరేటర్లు రెయ్యి వెంకట రమణ, సాడి పద్మారెడ్డి, మహమ్మద్ ఇమ్రాన్, ఉరుకూటి రామచంద్రరావు, నక్కిల లక్ష్మి, కె.వి.శశికళ, కోడిగుడ్ల పూర్ణిమ, పల్లా అప్పలకొండ, బిపిన్ కుమార్ జైన్, గుండాపు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు