జిల్లాకు జ్వరమొచ్చింది.. | - | Sakshi
Sakshi News home page

జిల్లాకు జ్వరమొచ్చింది..

Aug 3 2025 3:14 AM | Updated on Aug 3 2025 3:14 AM

జిల్లాకు జ్వరమొచ్చింది..

జిల్లాకు జ్వరమొచ్చింది..

● పెరుగుతున్న డెంగ్యూ, టైఫాయిడ్‌ బాధితులు ● ఏ ఇంట్లో చూసినా జ్వర పీడితులే ● రోగుల్లో క్రమంగా తగ్గుతున్న ప్లేట్‌లెట్లు ● పీహెచ్‌సీలలో రక్తపరీక్షల సౌకర్యం లేక గుర్తించడంలో ఆలస్యం ● ‘ఫ్యామిలీ డాక్టర్‌’ కనుమరుగై అనారోగ్యంతో మగ్గుతున్న పల్లెలు

సాక్షి, అనకాపల్లి:

జిల్లాలో డెంగ్యూ, టైఫాయిడ్‌, మలేరియా జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇంటికి ఇద్దరు, ముగ్గురు చొప్పున మంచాన పడుతున్నారు. ఏజెన్సీని ఆనుకొని ఉన్న మండలాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ప్రభుత్వానికి ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలన్న ధ్యాస కరువైంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ఇప్పుడు కనుమరుగు కావడంతో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇంటికే వైద్యం అందిన ఆ రోజులను తలచుకొని, ఇప్పుడు ఆస్పత్రికి వెళ్లినా చికిత్స సక్రమంగా అందని దైన్య స్థితిని చూ సి ఆవేదనకు గురవుతున్నారు. జిల్లాలో ఒక డిస్ట్రిక్ట్‌ ఆస్పత్రి, మూడు ఏరియా ఆస్పత్రులు, 7 సీహెచ్‌సీలు, 45 పీహెచ్‌సీలు, 9 యూపీహెచ్‌సీలున్నాయి. రోజువారీగా 3,600 నుంచి 3,700 వరకూ ఓపీలు నమోదవుతాయి. ఇందులో 70 శాతం జ్వరపీడితులే కావడం గమనార్హం. గత వారం రోజులుగా సీజనల్‌ జ్వరాలు పెరగడంతో గణనీయంగా ఓపీలు పెరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ ఫీవర్‌ రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో వైద్యశాఖ వైఫల్యం స్పష్టంగా కనపడుతుంది. ప్లూయిడ్స్‌ కొరత ఉంది. యాంటిబయోటిక్‌ ఇంజక్షన్‌లు, మలేరియా, డెంగ్యూ మందుల కొరత కూడా ఉన్నట్లు సాక్షి పరిశీలనలో వెల్లడైంది. జ్వరాల నివారణకు ముందస్తు అవగాహన కార్యక్రమాలు, ఆరోగ్య శిబిరాల నిర్వహణ, దోమల తెరల పంపిణీ వంటి చర్యలేవీ కానరావడం లేదు.

దోమల కిట్లు ఎక్కడ..?

ఏజెన్సీ ప్రాంతాన్ని ఆనకుని ఉన్న గొలుగొండ, నాతవరం, నర్సీపట్నం, రోలుగుంట, రావికమతం, మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి మండలాల్లో సీజనల్‌ జ్వరాలు చుట్టుముడతాయని తెలిసి కూడా జిల్లా యంత్రాంగం కనీసం దోమల తెరలు కూడా పంపిణీ చేయలేదు. జిల్లాలో వందలాది ఫార్మా కంపెనీలున్నాయి. వాటి నుంచి వచ్చే సీఎస్సార్‌ నిధులతో గతంలో దోమల తెరలు పంపిణీ చేశారు. ఈ ఏడాది కనీసం జిల్లా ఉన్నతాధికారులు, వైద్యశాఖ అధికారులు కనీసం ఆ ఆలోచన కూడా చేసిన పాపానలేదు.

రక్త పరీక్షల సదుపాయమూ కరువే..

అనకాపల్లిలోని ఎన్టీఆర్‌ జిల్లా ఆస్పత్రి, నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి, నక్కపల్లి, యలమంచిలి ప్రభుత్వ ఆస్పత్రి మినహా మిగిలిన చోట్ల డెంగ్యూ నిర్ధారిత రక్త పరీక్షల సదుపాయం లేదు. ఒకవేళ పరీక్షలు చేసినా మూడు, నాలుగు రోజులపాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈలోపు బాధితులకు ప్లేట్‌లెట్‌ కౌంట్‌ క్రమేపీ తగ్గిపోయి ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యంపై నమ్మకం లేక ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న పరిస్థితి నెలకొంది. జిల్లాలో గొలుగొండ, నాతవరం, రోలుగుంట, రావికమతం, మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి మండలాల్లో వైరల్‌ జ్వరాలు విజృంభిస్తున్నా.. సంబంధిత అధికారుల పర్యవేక్షణే కరువైంది. జిల్లాలో 30కి పైగా పీహెచ్‌సీల్లో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌ ఇంజక్షన్లు, మందులు అందుబాటులో లేవు. మాడుగుల మండలంలో కె.జె.పురం, కింతలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. పలుచోట్ల వైద్య సిబ్బంది కొరత కూడా వుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement