
బ్రిటిషర్ల సమాధుల స్థలాన్ని కాపాడండి
నర్సీపట్నం: ఆక్రమణదారుల నుంచి బ్రిటిషర్ల సమాధుల స్థలాన్ని కాపాడాలంటూ మున్సిపల్ కమిషనర్ సురేంద్ర, తహసీల్దార్ రామారావుకు టాక్స్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.త్రిమూర్తులరెడ్డి శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు వీరోచిత పోరాటానికి స్ఫూర్తికి చిహ్నంగా నిలిచిన సర్వే నంబరు 9లోని 46 సెంట్ల స్థలంలో బ్రిటిష్ సైనికుల సమాధుల స్థలాన్ని కొంతమంది కబ్జా చేసి శాశ్వత భవన నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. 46 సెంట్లలో ఇప్పటికే 27 సెంట్లు ఆక్రమణకు గురైందన్నారు. మిగిలిన 19 సెంట్లలో ప్రస్తుతం నిర్మాణ పనులు చేస్తున్నారని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నిర్మాణాలకు ఏవిధమైన అనుమతులు లేవన్నారు.
ఇటీవలో లీగల్ సెల్ చైర్మన్, పురావస్తు శాఖ సిబ్బంది స్థలాన్ని సందర్శించి, మున్సిపల్ అధికారుల సహకారంతో తుప్పులు డొంతకలతో ఉన్న స్థలాన్ని శుభ్రం చేయించారు. సమాధుల స్థలాన్ని కాపాడాల్సిన మున్సిపల్, రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొన్నారు.
ఇప్పటికై నా చారిత్రక నేపథ్యం ఉన్న స్థలాలను పరిరక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. సీఐటీయూ నాయకుడు అడిగర్ల రాజు, తదితరులు పాల్గొన్నారు.