● 17 రోజుల పాటు సరఫరా
● రోజుకు 8 వేల క్యూసెక్కుల విడుదల
సీలేరు : ఏపీ జెన్‌కో సీలేరు విద్యుత్ కాంప్లెక్స్ నుంచి గోదావరి డెల్టా పంట భూములకు అధికారులు ఆదివారం మరోసారి నీటిని విడుదల చేశారు. 17 రోజుల పాటు నీటిని పంపిణీ చేయనున్నట్టు జెన్‌కో సూపరింటెండెంట్ ఇంజినీర్ జాకీర్ హుస్సేన్ తెలిపారు. డొంకరాయి మెయిన్ డ్యామ్ 6, 7 నంబర్ల గేట్ల ద్వారా 3,700 క్యూసెక్కుల నీటిని నేరుగా శబరి నదిలోకి విడుదల చేస్తున్నట్లు చెప్పారు. దీనికి అదనంగా డొంకరాయి జలవిద్యుత్ కేంద్రంలో 25 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 4,300 క్యూసెక్కుల నీరు బయటకు వస్తోంది. వెరసి, మొత్తం 8,000 క్యూసెక్కుల నీరు గోదావరి డెల్టాకు చేరుతోందని ఆయన వివరించారు. నేటి నుంచి 17 రోజుల పాటు ప్రతిరోజూ 8,000 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. డొంకరాయి ఏఈ శివశంకర్ డ్యామ్ నీటిమట్టాలను పర్యవేక్షిస్తున్నారు.


