● సింహాద్రిమఠం ఆధ్వర్యంలో నిర్వహణ
● అధిక సంఖ్యలో పాల్గొన్న గిరిజనులు
చింతపల్లి : మండలంలోని లోతుగెడ్డ జంక్షన్‌లో ఉన్న శ్రీ దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో ఆదివారం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి సహస్రనామార్చన పూజ కన్నుల పండువగా జరిగింది. విశాఖపట్నం సింహాచలంలోని ‘సింహాద్రి మఠం’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో గిరిజన భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తరించారు. లోతుగెడ్డ పరిసర ప్రాంతాలు అప్పన్న నామస్మరణతో మారుమోగాయి.
వైభవంగా పూజా కార్యక్రమాలు
ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై స్వామివారి నమూనా విగ్రహాన్ని ఉంచి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. భక్తులను వరుస క్రమంలో ఆసీనులను చేసి విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, మండపారాధన కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో జరిపించారు. అనంతరం 1001 నామాలతో స్వామివారికి సహస్రనామార్చన నిర్వహించి, విశేష హారతులు సమర్పించారు. పూజలో పాల్గొన్న భక్తులకు స్వామివారి చిత్రపటాలను, పూజా సామగ్రిని ఉచితంగా అందజేశారు. కార్యక్రమం అనంతరం భక్తులందరికీ భారీ స్థాయిలో అన్నసమారాధన నిర్వహించారు.
భక్తిశ్రద్ధలతో పర్యవేక్షణ
సింహాచలం దేవస్థానం విశ్రాంత ప్రధానార్చకులు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు, సింహాద్రి మఠం గురుస్వామి కశిరెడ్డి సురేంద్రస్వామి ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల ఏర్పాట్లను తాజంగికి చెందిన కె.పురుషోత్తం, కె.కృష్ణతో పాటు లోతుగెడ్డ జంక్షన్‌కు చెందిన రమణ, సత్తిబాబు తదితరులు పర్యవేక్షించారు.


