మన్యంలో పుట్టి.. నీలి గగనంలోకి ఎగిరాడు. సాఫ్ట్‌వేర్ కొలువుల కంటే తన కన్న కలకే ప్రాణమిచ్చి, ఏపీ జెన్‌కో ప్రాజెక్టు గ్రామం సీలేరు నుంచి తొలి పైలట్‌గా రికార్డు సృష్టించాడు ఓద్దూరు సాయినాథ్. పట్టుదలే పెట్టుబడిగా, తల్లిదండ్రుల ప్రోత్సాహమే ఇంధనంగా మన్యం గర్వపడేలా సాయినాథ్ సాధించిన ఈ అద్భుత ప్రస్థానంనేటి యువతకు ఒక స్ఫూర్తిపాఠం.
● ఏజెన్సీ నుంచి తొలి పైలట్‌గా
సాయినాథ్ ఘనత
● శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లోకి..
● నేటి యువతకు స్ఫూర్తి
సీలేరు: గూడెంకొత్తవీధి మండలంలో మారుమూల గ్రామం సీలేరు నుంచి ఒక అద్భుత విజయం నమోదైంది. పట్టుదలే పెట్టుబడిగా, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఓద్దూరు సాయినాథ్ అనే యువకుడు పైలట్‌గా ఎంపికై , సీలేరు గ్రామం నుంచి ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు.
ఒకటో తరగతి నుంచి పైలట్ వరకు..
ఓద్దూరు శ్రీనివాస్ (శ్రీను మాస్టారు), కనకదుర్గ దంపతుల కుమారుడైన సాయినాథ్ ప్రాథమిక విద్య అంతా సీలేరులోని ఏపీ జెన్‌కో డీఏవీ పబ్లిక్ స్కూల్‌లోనే సాగింది. పదో తరగతి తర్వాత ఇంటర్మీడియట్ పూర్తి చేసి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో బీటెక్ పట్టా పొందాడు. విద్యాభ్యాసం పూర్తయ్యాక రెండు సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చినా, చిన్నప్పటి నుంచి ఉన్న పైలట్ కల తనను నిలవనీయలేదు. ఆ ఉద్యోగాలను వదులుకుని లక్ష్యం వైపు అడుగులు వేశాడు.
శిక్షణ .. అంతర్జాతీయ వేదికపై గుర్తింపు
పూణేలోని బారామతిలో ఉన్న ‘కార్వర్ ఏవియేషన్’లో ఫ్లయింగ్ ట్రైనింగ్ పూర్తి చేసిన సాయినాథ్, అనంతరం ఇండిగో ఎయిర్‌లైన్స్ నోటిఫికేషన్‌లో ఎంపికయ్యాడు. ఆ తర్వాత అబూదాబీలోని ‘ఎతిహాద్ ఏవియేషన్ ట్రైనింగ్’ సెంటర్‌లో ‘ఎయిర్ బస్ ఏ–320’ విమానాల కోసం ప్రత్యేక టైప్ రేటింగ్ శిక్షణ పొందాడు.శిక్షణ విజయవంతంగా ముగించుకుని, ఈ ఏడాది మార్చి 9న ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో జూనియర్ ఫస్ట్ ఆఫీసర్’గా పట్టా అందుకున్నాడు. ఇండిగో వైస్ ప్రెసిడెంట్లు కెప్టెన్ అషీమ్ మిత్రా, కెప్టెన్ సింగ్ చేతుల మీదుగా ఆయన ఈ గౌరవాన్ని పొందారు. ప్రస్తుతం హైదరాబాద్ బేస్ కేంద్రంగా దేశవ్యాప్తంగా విమాన సర్వీసుల్లో విధులను నిర్వహిస్తున్నారు.
ఒకే కుటుంబంలో ముగ్గురు ఉన్నత శిఖరాలకు
తండ్రి శ్రీనివాస్ మొదట అటవీ శాఖలో పని చేస్తూ, తర్వాత విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్‌లో ఫోర్‌మెన్‌గా స్థిరపడ్డారు. తన ముగ్గురు పిల్లలను క్రమశిక్షణతో ఉన్నత చదువులు చదివించారు. సాయినాథ్ సోదరీమణులు కూడా ఉన్నత స్థానాల్లో రాణిస్తున్నారు. పెద్ద కుమార్తె సౌజన్య జర్మనీలో ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో క్వాలిటీ స్పెషలిస్ట్‌గా పనిచేస్తున్నారు. చిన్న కుమార్తె తేజస్విని టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
తల్లిదండ్రుల ప్రోత్సాహంమరువలేనిది
నా తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ఈ స్థాయికి ఎదిగాను. చిన్నప్పటి నుంచి చదువులో ముందుండి వారికి మంచి పేరు తేవాలన్నదే నా లక్ష్యం. పైలట్ కావాలన్న నా పట్టుదలను వారు గౌరవించి వెన్నుతట్టారు.
– ఓద్దూరు సాయినాథ్, పైలట్


