కఠిన చర్యలు
ప్రస్తుతం జరిగే పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు ఏమా త్రం అవకాశం లేదు. ప్రతీ కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. ఇన్విజిలేటర్లు ఏమి చేసినా వారి మాటలు సైతం దానిలో నమోదవుతాయి. స్లిప్‌లు అందించాలని చూస్తే కేసులు పెట్టడమే కాకుండా కఠిన చర్యలు ఉంటాయి.
– క్రాంతి కుమార్, ఏటీడబ్ల్యూవో
●
కొయ్యూరు: ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీ విద్యార్థులకు తెలుగు భాషపై పట్టు లేకపోవడం వారి విద్యా భవిష్యత్తుపై, ముఖ్యంగా పదో తరగతి ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధమైంది. గత రెండున్నర దశాబ్దాలుగా కొనసాగుతున్న మాస్ కాపీయింగ్ సంస్కృతికి ఈసారి బ్రేక్ పడనుంది.
మాస్ కాపీయింగ్ నేపథ్యం..
సుమారు 25 ఏళ్ల క్రితం మావోయిస్టు ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో, పదో తరగతిలో విఫలమైతే విద్యార్థులు నిరాశతో మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితులవుతారనే భావన ఉండేది. ఆ ఉద్దేశంతోనే అప్పట్లో విద్యార్థులను మాస్ కాపీయింగ్ వైపు ప్రోత్సహించే వారనే అభిప్రాయం ఉంది. అయితే ప్రస్తుతం మావోయిస్టు ప్రభావం తగ్గడం, పోటీ ప్రపంచంలో నాణ్యమైన విద్య అవసరం కావడంతో అధికారులు ఈ విధానానికి స్వస్తి పలుకుతున్నారు. మాస్ కాపీయింగ్ వల్ల విద్యార్థుల భవిష్యత్తుకు ప్రమాదం పొంచి ఉందని గుర్తించి, పరీక్షలను కఠినంగా నిర్వహించాలని నిర్ణయించారు.
కువ్వి భాష ప్రభావం..
ప్రాథమిక పాఠశాలల్లో భాషా వలంటీర్లను నియమించినప్పటికీ, ఆదివాసీ విద్యార్థులు తెలుగుపై పట్టు సాధించలేకపోతున్నారు. 7, 8 తరగతులకు వచ్చినా చాలామంది విద్యార్థులు తెలుగులో అనర్గళంగా మాట్లాడలేకపోతున్నారు. వీరంతా తమ మాతృభాష అయిన ‘కువ్వి’ని అధికంగా మాట్లాడటమే దీనికి ప్రధాన కారణం. వాస్తవానికి ఐదో తరగతి పూర్తయ్యే సరికి తెలుగు భాషపై కనీస అవగాహన ఉండాలి. కానీ, ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను అర్థం చేసుకోవడంలోనూ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిని గమనించిన గత ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లోనే నాలుగు రకాల భాషల్లో (బహుభాషా విద్యా విధానం) పుస్తకాలను పంపిణీ చేసింది. అయితే తెలుగు మాత్రమే తెలిసిన వర్కర్లు ఉన్న చోట ఆ పుస్తకాల్లోని అంశాలను వివరించడం కష్టతరంగా మారింది. ఈ విధానాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేస్తేనే ప్రాథమిక స్థాయిలోనే తెలుగుపై పట్టు వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
నిఘా నీడలో పరీక్ష కేంద్రాలు
గత ఏడాది మార్చిలో జరిగిన పదో తరగతి ఫలితాల్లో కొయ్యూరు మండలం 70 శాతం ఉత్తీర్ణత సాధించింది. మాస్ కాపీయింగ్ లేకుండా ఇంత శాతం ఎలా సాధ్యమైందని నాటి కలెక్టర్ అధికారులను ప్రశ్నించినట్లు వార్తలు వచ్చాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత కలెక్టర్ పరీక్షల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు.
సీసీ కెమెరాల ఏర్పాటు
కొయ్యూరులోని మూడు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను అమర్చారు.
కఠిన నిఘా
ఒక్కో కేంద్రానికి ఒక ప్రత్యేక అధికారితో పాటు సిట్టింగ్ స్క్వాడ్‌లను నియమించారు.ఎట్టి పరిస్థితుల్లోనూ మాస్ కాపీయింగ్‌కు తావు లేకుండా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ కఠిన ఆదేశాలు జారీ చేశారు.
మాస్ కాపీయింగ్‌కు బ్రేక్


