పాడేరు: జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల నిర్వహణకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ అమిత్‌బర్దర్ తెలిపారు. పరీక్షలు అత్యంత పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని ఆదివారం ఆయన పేర్కొన్నారు.
నిఘా నీడలో పరీక్షా కేంద్రాలు
జిల్లావ్యాప్తంగా మొత్తం 72 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, ప్రతి కేంద్రం వద్ద ప్రత్యేక పోలీసు సిబ్బందితో గట్టి బందోబస్తు ఉంటుందని ఎస్పీ వివరించారు. పరీక్షలు ముగిసేంత వరకు అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. ప్రశ్నపత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కట్టుదిట్టమైన భద్రత కల్పించామని, అక్కడి నుంచి పరీక్షా కేంద్రాలకు చేరవేయడం మరియు తిరిగి జవాబు పత్రాలను సేకరించి భద్రపరిచే వరకు పోలీసు ఎస్కార్ట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈనెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను పరీక్షా సమయంలో మూసివేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు ఆయన పేర్కొన్నారు. నిరంతర పర్యవేక్షణ కోసం మొబైల్ పెట్రోలింగ్ బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్లు రంగంలో ఉంటాయి. కేవలం పరీక్షా విధుల్లో ఉన్న అధికారులు, ఇన్విజిలేటర్లు, సిబ్బంది హాల్ టికెట్ ఉన్న విద్యార్థులను మాత్రమే కేంద్రాల్లోకి అనుమతిస్తారన్నారు. బయటి వ్యక్తులు గుమిగూడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ఓపెన్ స్కూల్ పరీక్షలు
రెగ్యులర్ పరీక్షలతో పాటు, ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలు కూడా ఈనెల 16 నుంచి 28 వరకు ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు జరుగుతాయని ఎస్పీ తెలిపారు. పరీక్షల సమయంలో ఎక్కడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. ఏదైనా అనుమానాస్పద సంఘటనలు జరిగితే వెంటనే 100, 112 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని ఆయన సూచించారు. పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ఎస్పీ అమిత్ బర్దర్


