సమస్యలపై వెల్లువెత్తిన వినతులు
రంపచోడవరం: రంపచోడవరం మండలం సీమగండి నుంచి వేములకొండ గ్రామం వరకు సుమారు 20 కిలోమీటర్లు మేర రోడ్డు ఆధ్వానంగా ఉండడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని గిరిజనులు సోమవారం పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. కొంత మేర ఘాట్‌రోడ్డు ఉండడం ఎటువంటి రక్షణ చర్యలు లేకపోవడంతో ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణిస్తున్నామని కుర్ల అబ్బాయిరెడ్డి, కొండ్ల శ్రీదేవి, కుర్ల మోహర్‌వాణిలు తెలిపారు. రంపచోడవరం ఐటీడీఏ సమావేశపు హాలులో పీవో స్మరణ్‌రాజ్, సబ్ కలెక్టర్ సాహిత్‌లతో కలిసి పీజీఆర్‌ఎస్‌లో గిరిజనుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ వారం 78 అర్జీలు వచ్చినట్టు తెలిపారు. మారేడుమిల్లి మండలం కుట్రవాడ నుంచి పాములేరు వరకు ఐదు కిలోమీటర్లు బీటీ రోడ్డు నిర్మించాలని పాములేరు సర్పంచ్ రమాదేవి, సార్ల మంగిరెడ్డి, పల్లాల పండురెడ్డి తదితరులు అర్జీ అందజేశారు. పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురైన పెదబీంపల్లి –2 ఆర్‌అండ్‌ఆర్ కాలనీలైన మడపల్లి, పెనికిలపాడు, మంటూరు గ్రామాలకు ఒక పంచాయతీగా ఏర్పాటు చేయాలని సర్పంచ్ తోకల నాగరత్నం, ముర్ల సూర్యకుమారి కోరారు. దేవీపట్నం మండలం వెలగపల్లి నుండి దోనలంక మీదుగా పీహెచ్ గంగవరం,పెద్దనూతులు గ్రామాలకు లింకు రోడ్డు ఏర్పాటు చేయాలని సర్పంచ్ కె.శివారెడ్డి కోరారు. చింతలపూడి పంచాయతీ పెరికవలస రోడ్డు ఫారెస్టు క్లియరెన్స్ మంజూరు చేసి రోడ్డు నిర్మించాలని, వేటుకూరు–చింతలపూడి వరకు 15 కిలోమీటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. సిడిమెట్ల వరకు 8 కిలోమీటర్లు రోడ్డు, బొడ్డగుంట, చింతకొయ్య గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణం చేయాలని గిరిజనులు కోరారు. ఏపీవో డీఎన్‌వీ రమణ, తదితరులు పాల్గొన్నారు.


