
ప్రాజెక్ట్ కీలకం.. వీడని నిర్లక్ష్యం
ముంచంగిపుట్టు: ఆంధ్రా– ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీరందించే డుడుమ జలాశయం నిర్వహణపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. పవర్ ప్రాజెక్ట్‌కు నీటిని విడుదల చేసే గేట్లపై పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. వీటి వల్ల అనేకసార్లు విద్యుత్ ఉత్పాదన విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. జలాశయం నుంచి ప్రాజెక్టుకు విడుదల చేసే నీటితో పాటు పిచ్చి మొక్కలు, దుంగలు కొట్టుకువచ్చి సొరంగమార్గంలో జనరేటర్లకు అడ్డుపడ్డాయి. ఇలాంటి పరిస్థితుల వల్ల ఉత్పాదన నిలిచిపోతున్నా ప్రాజెక్ట్ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు.