
అక్రమార్కులకు రాజమార్గం
మొక్కుబడిగా అటవీశాఖ చెక్‌పోస్టులు
● తనిఖీలు శూన్యం ● 24 గంటలు తెరిచే ఉంటున్న గేట్లు ● అక్రమంగా తరలిపోతున్న కలప ● ప్రభుత్వ ఆదాయానికి గండి ● చూసీచూడనట్టుగా సిబ్బంది ● పట్టించుకోని అధికారులు
కొన్ని కలప జాతులను మైదాన ప్రాంతాలకు తరలించే సమయంలో అటవీశాఖ అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకునే సౌకర్యం ఉంది. ఆ కలపకు విలువ కట్టి అటవీశాఖ సీ ఫీజును వసూలు చేస్తుంది. తద్వారా అటవీశాఖకు ఆదాయం లభిస్తుంది. భవన నిర్మాణాలు,గృహ అవసరాలకు వినియోగించే కలపను తీసుకువెళ్లాలంటే అటవీశాఖ అనుమతులు ఉండాలి. అయితే తనిఖీలు చేయకపోవడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం చేజారుతోంది. ఈ విషయంలో చెక్‌పోస్టుల సిబ్బందిపై అవినీతి ఆరోపణలు లేకపోలేదు. అటవీ ఉద్యోగుల్లో కొందరు అక్రమార్కులకు సహకారం అందించడం వల్లే తనిఖీలు జరగడం లేదన్న విమర్శలు వినవస్తున్నాయి. ఒకే పర్మిట్ అధారంగా అనేక లారీలు, వ్యాన్లలో మైదాన ప్రాంతాలకు కలప తరలించి సొమ్ముచేసుకుంటున్నా చర్యలు శూన్యమనే చెప్పాలి.
అటవీశాఖ చెక్‌పోస్టులు నిరుపయోగంగా మారాయి. ఎప్పుడు చూసినా గేట్లు ఎత్తి ఉంటున్నాయి. కలప, ఇతర అటవీ సంపద వ్యాపారం చేసే అక్రమార్కులకు రాజమార్గాలుగా మారాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వంతాడపల్లి, లోతుగెడ్డ చెక్‌పోస్టుల వద్ద ఇదే పరిస్థితి ఉందన్న ఆరోపణలు లేకపోలేదు.
సాక్షి, పాడేరు: అటవీ అభివృద్ధితో పాటు వన్యప్రాణుల సంరక్షణ లక్ష్యంగా పనిచేస్తున్నా దిగువస్థాయి అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదు. ముఖ్యంగా అటవీ సంపద అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన చెక్‌పోస్టులు నిత్యం తెరిచే ఉండటం అక్రమార్కులకు వరంగా మారాయి.
● ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు పోయే ప్రధాన రోడ్లలో అటవీశాఖ పూర్వం నుంచి చెక్‌పోస్టుల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఇక్కడ అటవీశాఖ సిబ్బంది సిఫ్ట్‌ల వారీగా నిరంతరం వాహనాలు తనిఖీలు చేయాల్సి ఉంది. అయితే ఇటీవల కాలంలో అటవీశాఖ చెక్‌పోస్టు గేటులన్నీ పగలు, రాత్రి తేడాలేకుండా తెరిచి ఉన్నందున తనిఖీ చేసే పరిస్థితులు కనిపించడం లేదు.
నిరంతర తనిఖీలకు చర్యలు
అటవీశాఖ చెక్‌పోస్టుల వద్ద నిరంతరం అన్ని వాహనాల తనిఖీలకు చర్యలు తీసుకుంటాం.అటవీ సంపద పరిరక్షణతో పాటు,కలప అక్రమ రవాణా అడ్డుకునేందుకు అటవీశాఖ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తాం. కలప అక్రమ రవాణా, స్టాక్ పాయింట్లపై దృష్టిపెట్టి చర్యలు తీసుకుంటాం.
– సందీప్‌రెడ్డి, డీఎఫ్‌వో, పాడేరు డివిజన్
అన్నిచోట్ల ఇదే పరిస్థితి
సీ ఫీజుల వసూళ్లు కరువు
పాడేరు, చింతపల్లి అటవీశాఖ డివిజన్ల పరిధిలోని అన్ని చెక్‌పోస్టుల్లోను తనిఖీలు జరగడం లేదు. జిల్లా కేంద్రం పాడేరుకు సమీపంలోని వంతాడపల్లి చెక్‌పోస్టు మీదుగానే మైదాన ప్రాంతాలకు వాహనాలు ప్రయాణిస్తాయి. ఇటీవల కాలంలో విలువైన కలపను మైదాన ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్న ముఠాలు అధికమయ్యాయి. అలాగే పాడేరు ఘాట్‌తో పాటు జీనబాడు రేంజి పరిధిలోని అటవీ ప్రాంతాల్లో టేకుతోపాటు విలువైన ఇతర జాతుల కలప అక్రమ రవాణా భారీగా జరుగుతోంది. అడవి అంతా ఘాట్‌రోడ్డులో ఉంటే చెక్‌పోస్టు మాత్రం పాడేరుకు దగ్గరలో ఉన్నందున కలప అక్రమ రవాణాను అడ్డుకోలేక పోతున్నారు.
పాడేరులో ఇటీవల నిర్మించిన వందలాది భవనాలకు ఘాట్‌లో కలపనే వినియోగించారు. లా రీలు, వ్యాన్లలో అక్రమంగా పాడేరు తీసుకువస్తు న్నా చెక్‌పోస్టులో అడ్డుకునే వారే కరువయ్యారు.
అరకు నుంచి విశాఖపట్నం పోయే రోడ్డులో సుంకరమెట్ట, కాశీపట్నం, అనంతగిరి మండలంలోని మారుమూల జీనబాడు, చింతపల్లి మండలంలోని లోతుగెడ్డ ప్రాంతాల్లో అటవీశాఖ చెక్‌పోస్టుల్లోనూ వాహనాల తనిఖీలు జరగడం లేదని పలువురు బహిరంగంగా విమర్శిస్తున్నారు.

అక్రమార్కులకు రాజమార్గం

అక్రమార్కులకు రాజమార్గం

అక్రమార్కులకు రాజమార్గం